Income Tax Return Filing 2024 - Mutual Funds: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారా?. మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబుడులు ఉండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటిని అమ్మడం ద్వారా లాభం (capital gains) సంపాదిస్తే, ఆ విషయాన్ని మీ ITRలో రిపోర్ట్‌ చేయడం మాత్రం మరిచిపోవద్దు. 


మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను పత్రాల్లో వెల్లడించడం చాలా ముఖ్యం. మీరు దీనిని మరిచిపోయినా, కావాలనే వెల్లడించకపోయినా చాలా సులభంగా దొరికిపోతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు చేసే ప్రతి లావాదేవీ ఆదాయ పన్ను విభాగం దగ్గర రికార్డ్‌ అవుతుంది.


మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే లాభాల మీద చెల్లించాల్సిన పన్ను (Income Tax on Mutual Fund Profits) అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌ యూనిట్లను మీరు ఎంత కాలం పాటు హోల్డ్‌ చేశారు అన్నది కీలకమైన అంశం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ సహా ఏ రకమైన మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్‌ చేసినా, అన్నింటి పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 


హోల్డింగ్ పిరియడ్‌ ఆధారంగా టాక్స్‌
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం లోపులో అమ్మి లాభం సంపాదిస్తే, అది స్వల్పకాలిక మూలధన లాభం (short term capital gain - STCG) కిందకు వస్తుంది. దీనిపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభం పన్ను (short term capital gains tax) చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత అమ్మి లాభం సంపాదిస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభం (long term capital gain - LTCG) కిందకు వస్తుంది. దీనిపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను (long term capital gains tax) చెల్లించాలి. 


ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష లోపు ఉన్న దీర్ఘకాలిక మూలధన లాభంపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రూ. లక్షకు పైబడిన లాభంపై, ఇండెక్సేషన్ బెనిఫిట్‌ లేకుండా, 10% పన్ను చెల్లించాలి. డెట్‌ మ్యూచుల్‌ ఫండ్స్‌ విషయంలో, ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి 20% టాక్స్‌ కట్టాలి.


ఈ డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోండి
మీరు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మి లాభం సంపాదిస్తే, చాలా విషయాలపై దృష్టి పెట్టాలి. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు, ఫామ్‌ 16తో పాటు ఫామ్‌ 26AS, యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (AIS), టాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (TIS), క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్‌ను దగ్గర పెట్టుకోవాలి. ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యి, ఈ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు కొన్న, విక్రయించిన మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువల గురించిన పూర్తి సమాచారం AIS, TISలో ఉంటుంది. క్యాపిటల్ గెయిన్ స్టేట్‌మెంట్‌లో, స్వల్పకాలిక/దీర్ఘకాలిక మూలధన లాభం ఎంతో చూడవచ్చు. 


షెడ్యూల్ 112Aలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మూలధన లాభాలను; షెడ్యూల్ CGలో స్వల్పకాలిక మూలధన లాభాలను రిపోర్ట్‌ చేయాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి డివిడెండ్ కూడా పొందితే, దానిని ఇతర ఆదాయ వనరుల్లో (Schedule of Other Sources) చూపాలి.


మరో ఆసక్తికర కథనం: మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి?