Income Tax Return Filing 2024: తక్కువ పన్ను పరిధిలో ఉన్నవాళ్లకు, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవాళ్లకు టాక్స్‌ సేవింగ్‌ కోసం ఉత్తమ మార్గం.. ఆదాయ పన్నును ఆదా చేసే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Tax Saving Fixed Deposits). ప్రజలకు బాగా పరిచయం ఉన్న అన్ని ప్రభుత్వ & ప్రైవేట్‌ బ్యాంక్‌లు టాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీలను అందిస్తున్నాయి, మంచి వడ్డీ రేట్లను (Interest Rates On Tax Saving FDs) ఆఫర్‌ చేస్తున్నాయి.


2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్నును ఆదా చేసే అవకాశం ఇంకా మిగిలే ఉంది, ఈ ఏడాది మార్చి 31 దీనికి చివరి తేదీ. పన్ను ఆదా పెట్టుబడులపై మీరు ఇంకా డైలమాలో ఉంటే, మార్చి 31 లోగా కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే, మంచి అవకాశం కోల్పోయి, చేతులారా ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాల్సి వస్తుంది.


టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఎంత పన్ను ఆదా చేయవచ్చు?
టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80C కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ సెక్షన్‌ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఇది వర్తించదు.


ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్‌ ఉంటుంది. ఈ గడవుకు ముందే వెనక్కు తీసుకోవడానికి వీలుండదు. సెక్షన్ 80TTB కింద, సీనియర్ సిటిజన్లకు, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ వడ్డీ ఆదాయంపై రూ.50,000 వరకు పన్ను రాయితీ లభిస్తుంది.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), సుకన్య సమృద్ధి యోజన (SSY), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో నెలవారీ సిప్‌ (SIP in ELSS), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs), జీవిత బీమా ప్రీమియం ‍(Life Insurance Premiums) ‍‌చెల్లింపు ద్వారా కూడా పన్ను ఆదా చేయవచ్చు. అయితే, రిస్క్‌ తీసుకోగల పరిస్థితి, ఆర్థిక లక్ష్యాలను బట్టి మీ పెట్టుబడి ఆప్షన్‌ను తెలివిగా ఎంచుకోండి. 


పెట్టుబడికి సంపూర్ణ భద్రత ఉండాలనుకునే వ్యక్తులు, తక్కువ పన్ను బ్రాకెట్లలో ఉన్నవాళ్లు టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.


బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం, 2024 ఫిబ్రవరి 19 నాటికి, 10 పెద్ద బ్యాంక్‌ల్లో టాక్స్‌ సేవింగ్‌ FDలు &వడ్డీ రేట్లను పరిశీలిద్దాం. రూ.1 కోటి లోపు ఉన్న డిపాజిట్లనే ఇక్కడ పరిగణనలోకి తీసుకున్నాం. ఈ 10 పెద్ద బ్యాంక్‌ల్లో లక్షన్నర రూపాయలు డిపాజిట్‌ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో (ఐదేళ్లు పూర్తయ్యాక) ఎంత చేతికొస్తుందో చూద్దాం.


రూ.1 కోటి లోపు టాక్స్‌ సేవింగ్‌ FDలపై వడ్డీ రేట్లు - మెచ్యూరిటీ అమౌంట్‌:


యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ---- వడ్డీ రేటు: 7% ---- ఐదేళ్ల కాలానికి పెట్టుబడి: రూ. 1.5 లక్షలు ---- మెచ్యూరిటీ మొత్తం: రూ. 2.12 లక్షలు.


కెనరా బ్యాంక్ ---- వడ్డీ రేటు: 6.7%  ---- ఐదేళ్ల కాలానికి పెట్టుబడి: రూ. 1.5 లక్షలు  ---- మెచ్యూరిటీ మొత్తం: రూ.2.09 లక్షలు.


బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)‍‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ---- వడ్డీ రేటు: 6.5% ఐదేళ్ల కాలానికి పెట్టుబడి: రూ. 1.5 లక్షలు  ---- మెచ్యూరిటీ మొత్తం: రూ.2.07 లక్షలు.
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)---- వడ్డీ రేటు: 6.5% ఐదేళ్ల కాలానికి పెట్టుబడి: రూ. 1.5 లక్షలు  ---- మెచ్యూరిటీ మొత్తం: రూ.2.07 లక్షలు.


ఇండియన్ బ్యాంక్  ---- వడ్డీ రేటు: 6.25%  ---- ఐదేళ్ల కాలానికి  పెట్టుబడి: రూ. 1.5 లక్షలు  ---- మెచ్యూరిటీ మొత్తం: రూ. 2.05 లక్షలు.


బ్యాంక్ ఆఫ్ ఇండియా  ---- వడ్డీ రేటు: 6%  ---- ఐదేళ్ల కాలానికి పెట్టుబడి: రూ. 1.5 లక్షలు  ---- మెచ్యూరిటీ మొత్తం: రూ.2.02 లక్షలు.


మరో ఆసక్తికర కథనం: వినోద రంగాన్ని షేక్‌ చేసే డీల్‌ - చేతులు కలిపిన బడా కంపెనీలు