Reliance - Disney Deal: సంపన్న పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీకి (Mukesh Ambani) చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) - వాల్ట్ డిస్నీ (Walt Disney) ఇకపై భారతదేశంలో కలిసి పని చేయబోతున్నాయి. మీడియా కార్యకలాపాలను విలీనం చేసేందుకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌పై చాలా కాలం పాటు చర్చలు జరిగాయి. 


ఒప్పందం ప్రకారం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) - డిస్నీ కలిసి కొత్త సంస్థగా ఏర్పడతాయి. ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్‌కు 61 శాతం వాటా ఉంటుంది. భారత్‌లోని ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడంతో, రేస్‌లో ముందుండడానికి డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది.


బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ - వాల్ట్ డిస్నీ మధ్య ఖరారైన ఒప్పందం గురించి త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి, ఈ ఒప్పందానికి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టకూడదని రెండు కంపెనీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు తుది మెరుగులు దిద్దే సమయంలో, డిస్నీ స్థానిక ఆస్తుల ఆధారంగా వాటాల పంపిణీలో స్వల్ప మార్పులు ఉండవచ్చని సమాచారం.


అతి పెద్ద మీడియా సంస్థ ఆవిర్భావం
డిస్నీ - రిలయన్స్ మధ్య ఒప్పందం తర్వాత, భారతదేశ వినోద రంగంలో ఒక దిగ్గజం మీడియా సంస్థ పుట్టుకొస్తుంది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ చేసిన ప్రకారం, ఈ ఒప్పందంలో 61 శాతం వాటా కోసం రిలయన్స్ 1.5 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటి వరకు, 'ఓవర్‌ ది టాప్‌' (OTT) సెగ్మెంట్‌లో రిలయన్స్ నుంచి అమెరికన్ దిగ్గజానికి చాలా ఇబ్బంది ఎదురైంది. 2022లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) హక్కులపై ఈ రెండు కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొంది, ఆ గేమ్‌లో రిలయన్స్ విజయం సాధించింది. అంతేకాదు, HBO షోలను ప్రసారం చేసే హక్కులను కూడా డిస్నీ నుంచి రిలయన్స్ లాగేసుకుంది. విపరీతమైన ఒత్తిడి కారణంగా, డిస్నీ, భారతదేశంలో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌ పోటీలను మొబైల్‌లో ఉచితంగా ప్రసారం చేయవలసి వచ్చింది.


టాటా ప్లే కైవసం కోసం రిలయన్స్ సిద్ధం
టాటా గ్రూప్‌ కంపెనీ టాటా ప్లే లిమిటెడ్‌ను (Tata Play) కొనుగోలు చేసే ఆలోచనలోనూ రిలయన్స్‌ ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ చేసింది. ఈ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్ ప్రొవైడర్‌లో డిస్నీకి కూడా వాటా ఉంది. ప్రస్తుతం, టాటా ప్లే, టాటా సన్స్ (Tata Sons) యాజమాన్యంలో ఉంది. కంపెనీలో టాటా సన్స్‌కు 50.2 శాతం వాటా ఉంది. మిగిలిన షేర్లు డిస్నీ వద్ద, సింగపూర్‌కు చెందిన పెట్టుబడి కంపెనీ టెమాసెక్ (Temasek) వద్ద ఉన్నాయి.


ఈ రోజు (సోమవారం, 26 ఫిబ్రవరి 2024) ఉదయం 10.30 గంటల సమయంలో, BSEలో, రిలయన్స్‌ షేర్‌ ధర రూ.13.50 లేదా 0.45% నష్టంతో రూ.2,972.85 దగ్గర ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ గత ఆరు నెలల్లో దాదాపు 22%, గత 12 నెలల్లో దాదాపు 34%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 15% పెరిగింది, ఫుల్‌ రైజింగ్‌ ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనడానికి వెళ్తున్నారా? - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే