కొత్త ఏడాది మొదటి ట్రేడింగ్‌ సెషన్లో స్టాక్‌ మార్కెట్లు జోరుగా ఆరంభమయ్యాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలన్నీ భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 550+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 170+ పాయింట్ల లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెనవ్వడమూ ఈ జోరుకు దోహదం చేసింది.







చివరి సెషన్లో 58,253 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58,310 పాయింట్ల లాభంతో ఆరంభమైంది. అక్కడి నుంచి గరిష్ఠ స్థాయి 58,850ని అందుకుంది.  ఉదయం 11 గంటల సమయంలో 58,840 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 587 పాయింట్ల లాభంలో ఉంది.


శుక్రవారం 17,354 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 17,387 వద్ద మొదలైంది. ఇంట్రాడే గరిష్ఠమైన 17,528ని తాకింది. ప్రస్తుతం 165 పాయింట్ల లాభంతో 17,519 వద్ద కొనసాగుతోంది.


బ్యాంక్ నిఫ్టీ జోరు మీదుంది. 465 పాయింట్ల లాభంలో ఉంది. ఉదయం 35,585 వద్ద ఆరంభమైన సూచీ 35,953 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 35,526 వద్ద కనిష్ఠాన్ని చేరుకున్న సూచీ 35,946 వద్ద కొనసాగుతోంది.







నిఫ్టీలో 40 కంపెనీలు లాభాల్లో, 9 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఐచర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.53 నుంచి 1.53 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.