Stock Market Update: భారత స్టాక్‌ మార్కెట్లు ఒడుదొడులకు లోనవుతున్నాయి! ఈ వారంలో వరుసగా రెండో సెషన్లోనూ తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒకవైపు అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ ఆందోళనలు మదుపర్లను టెన్షన్‌ పెడుతున్నాయి. ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ వ్యాపించడంతో విక్రయాల బాట పడుతున్నారు. విచిత్రంగా ఫండమెటల్స్‌ బలంగా ఉన్న కంపెనీల షేర్లనూ అమ్మేస్తున్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 500, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


క్రితం రోజు 57,621 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ నేడు 57,799 వద్ద లాభాల్లోనే మొదలైంది. జోరుమీదున్న సూచీ వెంటనే 57,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అరగంట కాగానే అమ్మకాల సెగ మొదలైంది. దాంతో సూచీ 57,058 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం కొస్త కోలుకొని 444 పాయింట్ల నష్టంతో 57,177 వద్ద కొనసాగుతోంది.


Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!


సోమవారం 17,213 వద్ద మొదలైన నిఫ్టీ మంగళవారం 17,279 వద్ద మొదలైంది. 17,306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. అమ్మకాల ఒత్తిడితో 17,043 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కోలుకొని 108 పాయింట్ల నష్టంతో 17,105 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


నిఫ్టీ బ్యాంకు సైతం ఒడుదొడుల్లోనే ఉంది. ఉదయం 38,176 వద్ద మొదలైన సూచీ వెంటనే 38,222 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. విక్రయాల సెగతో పతనమవ్వడం మొదలైంది. 37,319 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు కాస్త కోలుకొని 555 పాయింట్ల నష్టంతో 37,347 వద్ద కొనసాగుతోంది.


నిఫ్టీలో 10 కంపెనీలు లాభాల్లో, 40 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సిప్లా, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరోమోటో కార్ప్‌, దివిస్‌ ల్యాబ్‌ లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎల్‌టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక ఫార్మాను మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపు రంగులోనే ఉన్నాయి. పవర్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు 1-2 శాతం నష్టపోయాయి.


Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత