Gautam Adani Surpasses Mukesh Ambani: కరోనా వ్యాప్తి సమయంలోనూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. దేశంలో అపర కుబేరుడిగా ఉన్న అదానీ తాజాగా మరో మైలురాయి అందుకున్నారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. భారత్‌కే చెందిన మరో కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఈ జాబితాలో వెనక్కి నెట్టేశారు.


బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వివరాల ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద సోమవారం నాటికి 88.5 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు. ముఖేష్ అంబానీ 87.9 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. దాదాపు 12 బిలియన్ డాలర్లు ఎగబాకడంతో అదానీ నెంబర్ వన్ అయ్యారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు, డేటా సెంటర్స్ లాంటి వ్యాపారాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ ఏడాది అత్యధిక మొత్తంలో లాభాలు ఆర్జించడంతో అదానీ ఈ ఘనత సాధించారు.


అదానీ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన కొన్ని లిస్టెడ్ స్టాక్స్ కేవలం గత రెండేళ్లలో 600 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. 2.9 ట్రిలియన్ డాలర్లతో ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని.. 2070 నాటికి కార్బన్ రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నందున, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సౌకర్యాల కంపెనీలకు ఈ అంశం సత్ఫలితాలు అందిస్తుంది.


పాజిటివ్ ఛాలెంజ్.. 
భారత్‌లో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు బొగ్గు, శిలాజ ఇంధనాలపై తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం వీరిద్దరూ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. పునరుత్వాదక ఉత్పత్తులు, ఇంధనాలపై 76 బిలియన్ డాలర్ల వ్యూహంలో భాగంగా అంబానీ ఒక్కరే రాబోయే మూడేళ్లలో 10 బిలియన్లు వెచ్చించడానికి సిద్ధమయ్యారు. 2030 నాటికి మొత్తం 70 బిలియన్ల పెట్టుబడితో  ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక-శక్తి ఉత్పత్తిదారుగా మారేందుకు గౌతమ్ అదానీ ఇది వరకే చర్యలు చేపట్టారు.


2025 నాటికి తన కంపెనీ పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని దాదాపు ఎనిమిది రెట్లు పెంచుకునే ప్రణాళికలను అదానీ ఇటీవల వెల్లడించారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్‌కు చెందిన పునరుత్పాదక శక్తి కంపెనీని 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది.


Also Read: Petrol-Diesel Price, 8 February: ఇక్కడ భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, మిగతా నగరాల్లో హెచ్చుతగ్గులు, ఇవాల్టి ధరలు ఇవీ.. 


Also Read: Gold-Silver Price: నేడు ఎగబాకిన బంగారం, దిగొచ్చిన వెండి.. నేటి తాజా ధరలు ఇవీ