SpiceJet makes shocking revelation of not paying 350 crore in TDS and PF of employees : స్పైస్ జెట్ విమానయాన సంస్థ మరోసారి నగదు సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సంస్థ ఉద్యోగులకు చెందిన పీఎఫ్, టీడీఎస్‌లను కూడా చెల్లించడం లేదు. గత మూడేళ్లుగా రూ. 350 కోట్ల వరకూ ఇలా బకాయిలు పెట్టినట్లుగా తాజాగా వెల్లడించింది. ఇందులో రూ.220 కోట్లు టీడీఎస్ కాగా.. మిగతా మొత్తం ప్రావిడెంట్ ఫండ్ మొత్తంగా తెలుస్తోంది. ఈ విషయాలను బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు స్పైస్ జెట్ సంస్థ స్వయంగా తెలియచేసింది. ఈ మేరకు ప్రిలిమినరీ ప్లేస్‌మెంట్ డాక్యుమెంట్‌ను బీఎస్ఈకి సమర్పించింది.


ఇటీవలి కాలంలో నష్టాలు పెరిగిపోవడం, కంపెనీ వద్ద నగదు కొరత ఏర్పడటంతో ఎలాంటి చెల్లింపులు చేయలేకపోతోంది. ఉద్యోగులకు సంబంధించి జీతాల నుంచి కట్ చేస్తున్న మినహాయింపులు ఏవీ జమ చేయడం లేదని బీఎస్ఈకి తెలిపింది. ప్రస్తుతం కంపెనీని నడిపేందుకు రూ. మూడు వేల కోట్ల రూపాయల నగదు అవసరమని ఇందు కోసం నిధుల సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మార్గెట్ వర్గాల నుంచి క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్  ప్లేస్ మెంట్.. క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ , ఇండియన్  బ్యాంక్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయాలు వెలుగులోకి రాలేదు. ఈ నిధులు వస్తే.. పూర్తి స్థాయిలో వినియోగించుకుని  స్పైస్ జెట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగేలా చూసుకుంటామని కంపెనీ చెబుతోంది. 


కోట్లు సంపాదించే ఇండియన్స్ రాకెట్ వేగంతో పెరిగిపోతున్నారు - ఎలా సంపాదిస్తున్నారంటే ?


కంపెనీ ముందుగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన వాటిని చెల్లింపులు చేయడంతో పాటు.. వివిధ రకాల వెండర్స్ కు రూ. ఆరు వందల యాభై కోట్ల వరకూ చెల్లింపులు చేయాల్సి ఉంది. చెల్లింపులు సరిగ్గా చేయకపోవడంతో స్పైస్ జెట్ ప్రమోటర్ పై ఇప్పటికే పాతికపైగా కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి. పలు లీజు అగ్రిమెంట్స్ లో డీఫాల్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరికి విమానాలు అద్దెకిచ్చిన వారికి కూడా చెల్లింపులు సరిగ్గా చేయకపోవడంతో వారు కూడా కోర్టులకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.               


లైట్ స్విచ్చాన్ చేసే ఉద్యోగం - ఏటా రూ.30 కోట్ల జీతం - ఇప్పటికీ ఖాళీ ఉంది ట్రై చేస్తారా ?


ఆర్థిక సమస్యల కారణంగా స్పైస్ జెట్ ఇప్పటికే తమ సామర్థ్యంలో సగం విమాన సర్వీసులను నిలిపివేసింది. మొత్తం సంస్థ 64 ఎయిర్ క్రాఫ్టులు నడుపుతూంటే అందులో 36 గాల్లోకి ఎగరడం లేదు.ఉల్లంఘనల కారణంగా సెబీ నుంచి కూడా ఆనేక రకాలుగా ఫైన్స్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోవిడ్ సమయంలో ఏర్పడిన ఆర్థిక క్లిష్ట పరిస్థితుల వల్లనే స్పైస్ జెట్ దెబ్బతిన్నదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ సన్ గ్రూపు చేతిలో ఉన్నప్పుడు కూడా.. ఈ ఎయిర్ లైన్స్ తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. తర్వాత చేతులు మారింది. మెరుగుపడుతుందనుకున్న దశలో కరోనా దెబ్బ తగిలింది.