Data Patterns Shares: రక్షణ రంగ కంపెనీ డేటా ప్యాటర్న్స్ (ఇండియా) షేర్లు ఇవాళ (మంగళవారం) రికార్డ్‌ స్థాయికి చేరాయి. బలమైన బిజినెస్‌ ఔట్‌లుక్‌ కారణంగా ఇంట్రా డే ట్రేడ్‌లో 9 శాతం ర్యాలీ చేసి రూ.1,400 వద్ద కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకాయి. 


గత మూడు నెలల్లో, S&P BSE సెన్సెక్స్‌లోని 8 శాతం పెరుగుదలతో పోలిస్తే డేటా ప్యాటర్న్స్ స్టాక్ 95 శాతం (దాదాపు రెట్టింపు) జూమ్ అయింది. గత రెండు నెలల్లో ఈ షేరు ధర భారీ ర్యాలీ చేసింది. కంపెనీ మార్కెట్‌ విలువ గత ఆరు నెలల కాలంలోనే సగానికి సగం లేదా 49 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD), ఈ కంపెనీ ఒక్కో షేరు ధర 588 రూపాయలు లేదా 76 పెరిగింది.


ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్ 24న స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. BSEలో ఇష్యూ ప్రైస్‌ రూ.585 నుంచి లెక్క వేస్తే, ఇప్పటివరకు ఈ కౌంటర్‌ 139 శాతం లాభాలను అందించింది.


వ్యాపారం
ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ & ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ సొల్యూషన్స్‌ను డేటా ప్యాటర్న్స్ అందిస్తోంది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసే రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది.


రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, కమ్యూనికేషన్స్, ఏవియానిక్స్ మొదలైన అన్ని ప్రధాన ఉప వ్యవస్థల్లోనూ కాళ్లు, వేళ్లు పెట్టిన డేటా ప్యాటర్న్స్, ఇప్పుడు కొత్తగా ఇండియన్ డిఫెన్స్ & ఏరోస్పేస్ సెగ్మెంట్‌లో భారీ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అడుగులు వేస్తోంది. సొంత డిజైన్లతో సమగ్ర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. 'మేక్ ఇన్ ఇండియా', ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల దన్నుతో వ్యాపారాన్ని విస్తరిస్తోంది.


రక్షణ ఎగుమతులపై ప్రభుత్వ సమాచారం ప్రకారం, FY23 (ఏప్రిల్-సెప్టెంబర్ 2022) మొదటి ఆరు నెలల్లో రూ.8,000 కోట్ల విలువైన "దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన" (Indigenously) రక్షణ పరికరాలను మన దేశం నుంచి ఎగుమతి చేసింది.


టెక్నికల్‌ ఔట్‌లుక్‌
టార్గెట్‌: రూ.1,446
సపోర్ట్‌: రూ.1,383, రూ.1,308


ఇష్యూ ప్రైస్‌ కంటే 139 శాతం వృద్ధితో పెట్టుబడిదారుల సంపదను రెట్టింపుపైగా పెంచిన ఈ స్టాక్, కీలక టెక్నికల్‌ రెసిస్టెన్స్‌ కంటే పైనే సౌకర్యవంతంగా ట్రేడవుతోంది. అంతేకాదు.. మూవింగ్ యావరేజ్‌లు, మొమెంటం ఇండికేటర్లు అన్నీ కలిసి ఎద్దులకు మద్దతుగా నిలున్నాయి.


డైలీ చార్ట్‌లో బోలింగర్ బ్యాండ్ అప్పర్‌ ఎండ్‌ (రూ.1,308), వీక్లీ చార్ట్‌లో బోలింగర్ బ్యాండ్ అప్పర్‌ ఎండ్‌ (రూ.1,383) కన్నా పైకి ఇవాళ స్టాక్‌ ధర చేరింది.


మంత్లీ ఫిబొనాసీ చార్ట్‌ ప్రకారం.. ప్రస్తుత స్థాయిలోనూ స్థిరమైన అప్‌మూవ్ ఉంటే స్టాక్‌ ధర రూ.1,446 వైపునకు, ఆ తర్వాత రూ.1,473 వైపునకు వెళ్తుంది. సమీప కాల మద్దతు (సపోర్ట్‌) రూ.1,383 దగ్గర ఉంది. ఒకవేళ స్టాక్‌ పతనమై ఈ స్థాయి దగ్గర నిలదొక్కుకోలేకపోతే ఆ తర్వాత రూ.1,308 వద్దకు, అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా లేకపోతే రూ.1,182 (20-డేస్‌ మూవింగ్ యావరేజ్) వద్దకు పడిపోయే అవకాశం ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.