ఇప్పుడు 'కాంతార' (Kantara) సినిమా పేరు దేశవ్యాప్తంగా వినబడుతోంది. తొలుత కన్నడలో విడుదల అయిన సినిమా... ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల అయ్యింది. అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతే కాదు... భారీ వసూళ్లు కూడా సాధిస్తోంది. సంచలన విజయం నమోదు చేసింది. కన్నడలో కేవలం రెండు వారాల్లో వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. మిగతా భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. 'కాంతార'ను మెచ్చిన ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Kantara Sequel Update : ''కాంతార'కు సీక్వెల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, ప్రీక్వెల్ (Kantara Prequel) కూడా! అయితే, ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించడం లేదు. రెండు నెలలు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విశ్రాంతి సమయంలో... ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను'' అని రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'కాంతార' కథకు...
రిషబ్ బాల్యానికి!
'కాంతార' చిత్రంలో కథానాయకుడిగా నటించడమే కాదు... ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయన బాల్యానికి, 'కాంతార' కథకు ఓ సంబంధం ఉంది. ఆయన దక్షిణ కర్ణాటకలో తీర ప్రాంతానికి చెందిన వ్యక్తి. అక్కడ దైవారాధన ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కుల దైవం వంటి ఆచారాలు ఉన్నాయి. బాల్యంలో ఆ ఆచారాలను గమనించిన రిషబ్ శెట్టి, ఈ సినిమాలో చూపించారు.
'కెజియఫ్' (KGF) కంటే ముందు నుంచి...
'కాంతార' సినిమాను కన్నడలో విడుదల చేసే ఉద్దేశంలో తీశామని, మా చిత్రానికి వచ్చిన స్పందన చూశాక... ఇతర భాషల్లో డబ్బింగ్ చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. 'కెజియఫ్' తర్వాత ఇతర భాషల్లో కన్నడ సినిమాలకు ఆదరణ పెరిగిందని చాలా మంది భావిస్తున్నారని, అది నిజం కాదని ఆయన పేర్కొన్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అని, ఆయన 'మహిషాసుర మర్ధిని' సినిమా పలు భాషల్లో డబ్బింగ్ అయ్యిందని రిషబ్ శెట్టి గుర్తు చేశారు.
Also Read : రొమాన్స్, థ్రిల్, సూసైడ్ - హెబ్బా పటేల్ సినిమాలో నరేష్, పవిత్రా లోకేష్
'కాంతార' సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. రెండు రోజుల్లో ఈ సినిమా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. కథానాయిక సప్తమి గౌడ పాత్ర సహజంగా ఉందని చాలా మంది ప్రశంసించారు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. 'కెజియఫ్' రెండు భాగాలతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్.