హెబ్బా పటేల్ (Hebah Patel) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'కుమారి 21 ఎఫ్' గుర్తు వస్తుంది. ఎందుకంటే... ప్రేక్షకులపై ఆ సినిమా ప్రభావం అటువంటిది. దాని కంటే ముందు 'అలా ఎలా?' సినిమా చేసినా... 'కుమారి 21 ఎఫ్'తో కుమారిగా ముద్ర పడింది. ఆ సినిమా తర్వాత కూడా ఆమె గ్లామర్ రోల్స్ ఎక్కువ చేశారు. ఇప్పుడు హెబ్బా పటేల్ రూట్ మార్చారు. గ్లామర్ పక్కన పెట్టి యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్, డీ - గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. అందుకు 'ఓదెల రైల్వే స్టేషన్' తొలి మెట్టు అయితే... 'తెలిసిన వాళ్ళు' రెండో మెట్టు అని చెప్పుకోవాలి.


నవంబర్‌లో విడుదలకు రెడీ!
Hebah Patel New Movie Update : హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'తెలిసిన వాళ్ళు' (Telisinavaallu Movie). ఇందులో రామ్ కార్తీక్ హీరో. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి (Viplove Koneti) దర్శక - నిర్మాణంలో తెరకెక్కింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని విప్లవ్ కోనేటి తెలిపారు. ఇందులో నరేష్, పవిత్రా లోకేష్ కీలక పాత్రలు చేశారు. 


రొమాన్స్, థ్రిల్, సూసైడ్!
'తెలిసిన వాళ్ళు' విడుదల సందర్భంగా దర్శక నిర్మాత విప్లవ్ కోనేటి మాట్లాడుతూ ''విభిన్న కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారు. మా సినిమా విడుదల తర్వాత ఆమె గ్లామర్ గురించి కాకుండా యాక్టింగ్ గురించి మాట్లాడతారు. అంతలా ఆమె పెర్ఫార్మన్స్ ఉంటుంది. మినిమల్ మేకప్‌తో, కొన్ని సన్నివేశాల్లో నో మేకప్‌తో నటించారు. ఆమె నుంచి ఆశించే రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. రొమాన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ జానర్స్ మిళితం చేసి.... కొత్త తరహా కథనంతో సినిమా రూపొందించాం'' అని చెప్పారు. 


Also Read : రామ్ 'చరణ్ - అర్జున్' అల్లు సినిమాకు నిర్మాత రెడీ



'తెలిసిన వాళ్ళు' సినిమా నుంచి విడుదల చేసిన 'శశివదనే' పాటకు మంచి స్పందన లభించిందని, ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారని చిత్ర సమర్పకులు కేఎస్వీ పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆత్మహత్యకు సిద్ధపడిన పాత్రలో హెబ్బా పటేల్ నటించారు. "నన్ను నేను చంపుకోబోతున్నాను" అని టీజర్‌లో హీరోయిన్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి కలిగించింది. 


హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, సీనియర్ నరేష్ (Naresh VK), పవిత్రా లోకేష్, జయ ప్రకాష్ నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్, అనంత్ నాగ్ కావూరి, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, సాహిత్యం: డాక్టర్ జివాగో, నృత్యాలు : జావేద్ మాస్టర్, పోరాటాలు : సీహెచ్ రామకృష్ణ, కళ : ఉపేందర్ రెడ్డి, సంగీతం : శ్రీ చరణ్ పాకాల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం,నిర్మాత : విప్లవ్ కోనేటి.