SBI Interest Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచుతుండడంతో, ఆ భారాన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్ల నెత్తి మీద వేస్తున్నాయి. అంతేకాదు, పొదుపు ఖాతాల మీద ఇచ్చే వడ్డీ రేట్లనూ తగ్గిస్తున్నాయి. అంటే.. ఆ చెంపా, ఈ చెంపా ఎడాపెడా వాయిస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచాయి. వ్యక్తిగత, గృహ రుణాలు, వాహన రుణాల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నెలవారీ కిస్తీలు (EMI) మరింత ప్రియం కాబోతున్నాయి.
SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ₹10 కోట్ల లోపు ఉన్న పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటును గతంలోని 2.75 శాతం నుంచి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.7 శాతానికి పరిమితం చేసింది. పొదుపు ఖాతాలో ₹10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉంటే వడ్డీ రేటును గతంలోని 2.75 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచి 3 శాతానికి చేర్చింది. అంటే, సామాన్య కస్టమర్ల నోటి కాడ కూడు లాక్కుని సంపన్న కస్టమర్లకు గోరుముద్దలుగా పెడుతోందన్నమాట. ఏడాది కాల పరిమితికి MCLR లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.95 శాతానికి చేర్చింది. రెండు, మూడేళ్ల కాలపరిమితి MCLRను కూడా వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి మార్చింది.
₹2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై సాధారణ జనానికి 3 శాతం నుంచి 5.85 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. గతంలో ఇది 2.90 శాతం నుంచి 5.65 శాతంగా ఉంది.
సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఇవే కాలావధుల కోసం గతంలోని 3.4 - 6.45 శాతంతో పోలిస్తే ఈసారి 3.5 శాతం నుంచి 6.65 శాతం మధ్య సంపాదిస్తారు. SBI కొత్త రేట్లు ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రభుత్వ యాజమాన్యంలోని మరో బ్యాంకర్ 'బ్యాంక్ ఆఫ్ బరోడా' (BoB) కూడా ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (FCNR) డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను గరిష్టంగా 135 బేసిస్ పాయింట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, వివిధ కాలావధులకు ఈ పెంపుదల వేర్వేరుగా ఉంటుంది. కొత్త వడ్డీ రేట్లు నవంబరు 15 వరకు అమల్లో ఉంటాయి.
కోటక్ మహీంద్ర బ్యాంక్ & ఫెడరల్ బ్యాంక్
వివిధ కాలావధుల కోసం 'మార్జినల్ బేస్డ్ కాస్ట్ లెండింగ్ రేట్ల'ను 7.7 నుంచి 8.95 శాతం వరకు కోటక్ మహీంద్ర బ్యాంక్ సవరించింది. ఏడాది MCLRను 8.75 శాతానికి పెంచింది. ఫెడరల్ బ్యాంక్ కూడా.. ఏడాది కాల పరిమితి MCLRను 8.7 శాతానికి పెంచింది.