Avenue Supermarts Shares: డి-మార్ట్ బ్రాండ్‌తో రిటైల్ ఛైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ (Avenue Supermarts) షేర్లు ఇవాళ్టి (సోమవారం) ట్రేడింగ్‌లో 4 శాతం వరకు పడిపోయాయి.
మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 139.95 రూపాయలు లేదా 3.25 శాతం నష్టంతో 8 వారాల కనిష్ట స్థాయి వద్ద ఈ స్టాక్ ట్రేడవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత ఇదే లో లెవల్.
వారం 6 శాతం డౌన్
గత వారం రాజుల్లోనే ఈ స్క్రిప్ 269.45 రూపాయలు లేదా 6 శాతం క్షీణించింది. ఇదే కాలంలో, బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ ఒక శాతం పెరిగింది. గత ఒక సంవత్సర కాలంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్ ద్వారా నమోదైన 5 శాతం పతనంతో పోలిస్తే, ఈ కౌంటర్ 15 శాతం నష్టపోయింది.
గత నెల రోజుల్లో 4 శాతం క్షీణించినా, గత ఆరు నెలల ట్రైమ్ ఫ్రేమ్‌లో 3 శాతం వరకు రాణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 11 శాతం పైగా పడిపోయింది.
మన దేశంలోని అతి పెద్ద ఆహారం & కిరాణా రిటైలర్లలో డీ మార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) ఒకటి. ఒకే కప్పు కింద గృహ & వ్యక్తిగత ఉత్పత్తులను అమ్ముతోంది. ఆహార, ఆహారేతర (FMCG) ఉత్పత్తులు, సాధారణ సరుకులు, దుస్తులు వంటివాటిని ఒకే సూపర్ మార్కెట్‌లో పేర్చి వినియోగదారులకు అందిస్తోంది.
తగ్గిన మార్జిన్
సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23) ఈ కంపెనీ పనితీరు గొప్పగా లేదు, అలాగని చెత్తగానూ లేదు.
ప్రి-క్వార్టర్లీ అప్‌డేట్‌లో మేనేజ్‌మెంట్ గైడెన్స్ ప్రకారమే ఆదాయం కనిపించింది. అనుకూలమైన బేస్ వల్ల, ఆదాయం 36.6 శాతం వార్షిక వృద్ధితో రూ.10,638 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఇతర ఖర్చులు గణనీయంగా 51 శాతం పెరిగి రూ.528 కోట్లకు చేరాయి. ఫలితంగా, ఎబిటా EBITDA మార్జిన్ గతేడాదిలోని 8.6 శాతం నుంచి 20 బేసిస్ పాయింట్లు తగ్గి 8.4 శాతంగా నమోదైంది. మార్జిన్ తగ్గడంతో షేరు ధర పతనమైంది.
ఆదాయాలను ఇంకాస్త పద్ధతిగా విశ్లేషిస్తే... డీమార్ట్ ప్రతి స్టోర్ సగటు ఆదాయం (per store revenue) గత సంవత్సరం కంటే (YoY) 9 శాతం పెరిగినప్పటికీ; ఒక్కో చదరపు అడుగుకు వచ్చిన ఆదాయం (revenue/sqft) కొవిడ్ పూర్వస్థాయి కంటే 10 శాతం తక్కువగా ఉంది. స్టోర్ సైజ్ పెద్దగా ఉండడం, ద్రవ్యోల్బణం కారణంగా ఆహారేతర విభాగాల్లో అమ్మకాలు తగ్గడం దీనికి కారణం.
ఫెస్టివల్ సీజన్ అమ్మకాల నేపథ్యంలో, డీమార్ట్ మూడో త్రైమాసికం (Q3FY23) ఫలితాలను మార్కెట్ కీలకంగా గమనిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.