SEBI: స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (Sebi) నుంచి జరిమానాలు ఎదుర్కొంటూ, చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తుల గుట్టుమట్లు తెలుసుకునేందుకు సెబీ ఒక రివార్డ్ కార్యక్రమాన్ని ప్రకటించింది. అంతుచిక్కని వ్యక్తుల నుంచి జరిమానాలను రికవరీ చేసే లక్ష్యంతో ఈ ప్లాన్‌ను జనం ముందుకు తీసుకొచ్చింది.
చిక్కడు-దొరకడు టైప్‌లో తిరుగుతున్న డిఫాల్టర్ల ఆస్తుల గురించిన నమ్మకమైన సమాచారాన్ని తమకు అందిస్తే, అలాంటి ఇన్ఫార్మర్‌కు ₹20 లక్షల వరకు నజరానా ఇస్తామని సెబీ ప్రకటించింది.
515 పేర్లతో ఒక లిస్ట్
అంతేకాదు, ఇన్‌ఫార్మర్‌కు పెద్దగా శ్రమ కూడా ఇవ్వడం లేదు సెబీ. ఎవరి ఆస్తుల వివరాలు కావాలో, వాళ్ల జాబితాను కూడా రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసింది. మొత్తం 515 పేర్లను ఆ లిస్ట్‌లో ప్రకటించింది. వీళ్ల గురించిన సమాచారాన్ని అందిస్తే చాలు. ఈ సమాచారాన్ని ఎవరైనా అందించవచ్చు, ₹20 లక్షల బహుమతి పొందవచ్చు.
బకాయిలు రికవరీ చేయడానికి అన్ని మార్గాలు ఉపయోగించి ఓడిపోయిన సెబీ, చివరి అస్త్రంగా రివార్డ్ కార్యక్రమాన్ని ప్రకటించింది.
రెండు దశల్లో రివార్డ్‌లు
ఒకవేళ, ఈ 515 మందిలో ఒక వ్యక్తి ఆస్తుల గురించిన సమాచారాన్ని సెబీకి మీరే అందిస్తే, ఈ రివార్డు రెండు దశల్లో మీకు మంజూరు అవుతుంది. అవి.. 1. మధ్యంతర దశ, 2. తుది దశ.
ఎగవేతదారు నుంచి రికవరీ చేసిన మొత్తం విలువలో 2.5% లేదా ₹5 లక్షల్లో ఏది తక్కువైతే అది మధ్యంతర దశలో ఇన్‌ఫార్మర్‌కు సెబీ అందిస్తుంది. తుది దశలో, డిఫాల్టర్ నుంచి వసూలు చేసిన బకాయి మొత్తం విలువలో 10% లేదా ₹20 లక్షల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని అందిస్తుంది.
రికవరీ ప్రొసీడింగ్స్ కింద డిఫాల్టర్ ఆస్తుల గురించి విశ్వసనీయ సమాచారాన్ని అందించే ఇన్‌ఫార్మర్‌కు రివార్డ్ మంజూరుపై సెబీ (Securities and Exchange Board of India) మార్గదర్శకాలు విడుదల చేసింది. "ఇన్‌ఫార్మర్ అందించిన సమాచారాన్ని, ఇన్ఫార్మర్ గుర్తింపును, అతనికి చెల్లించిన రివార్డ్ మొత్తాన్ని గోప్యంగా ఉంచుతాం" అని ఆ మార్గదర్శకాల్లో సెబీ పేర్కొంది.
అంతేకాదు, 'రికవరీ చేయడం కష్టం' ('Difficult to Recover') అని ధృవీకరించిన వర్గీకరణలో ఉన్న వ్యక్తికి చెందిన ఆస్తి సమాచారాన్ని అందజేస్తే, అతను లేదా ఆమెను రివార్డ్‌కు అర్హులైన ఇన్‌ఫార్మర్‌గా పరిగణిస్తారు అని సెబీ వెల్లడించింది.
ఎంత నజరానాకు అర్హత ఉందనే అంశంపై సిఫారసు చేసేందుకు ఒక కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. ఈ నజరానాను మదుపర్ల భద్రత, అవగాహన నిధి నుంచి చెల్లిస్తారు. ఈనెల 8 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. 2021-22 సెబీ వార్షిక నివేదిక ప్రకారం.. ‘వసూలు కష్టంగా మారిన బకాయిల విభాగం కింద 2022 మార్చి చివరి నాటికి రూ.67,228 కోట్ల బకాయిలను సెబీ గుర్తించింది.
రివార్డ్ సంబంధిత విషయాలను సిఫార్సు చేసేందుకు సెబీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తోంది. రికవరీ & రీఫండ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్; ఈ విషయంలో అధికార పరిధి కలిగి ఉన్న సంబంధిత రికవరీ ఆఫీసర్; చీఫ్ జనరల్ మేనేజర్ నామినేట్ చేసిన మరొక రికవరీ ఆఫీసర్; ఇన్వెస్టర్ అసిస్టెన్స్ ఆఫీస్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్‌లో ఉన్న అధికారి; ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (IPEF) ఇన్‌ఛార్జ్ చీఫ్ జనరల్ మేనేజర్ ద్వారా నామినేట్ అయిన ఇన్వెస్టర్ అసిస్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్‌లో ఉన్న అధికారి ఈ కమిటీలో ఉంటారు.
రివార్డ్ కోసం ఇన్‌ఫార్మర్ అర్హతను, ఇన్‌ఫార్మర్‌కు ఎంత మొత్తం రివార్డ్ చెల్లించవచ్చన్న విషయాన్ని సెబీకి ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది.
ఇన్‌ఫార్మర్‌కు మంజూరు చేసే రివార్డ్ మొత్తాన్ని ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (Investor Protection and Education Fund) నుంచి చెల్లించనున్నట్లు సెబీ తెలిపింది.