పోటాపోటీ దీక్షలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఓవైపు దీక్ష చేస్తున్న కవితకు మద్దతుగా భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఢిల్లీ చేరుకుంటున్నారు. లిక్కర్ స్కామ్‌పై ధర్నాకు బీజేపీ పిలుపునిచ్చింది. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి రెండు పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కాసేపట్లో ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక్కరోజు నిరహార దీక్ష చేయనున్నారు. దీనికి ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్‌లో ఉన్న మహిళా నాయకులు, మంత్రులు ఆమెకు సంఘీభావంగా దీక్షలో కూర్చోనున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు సభ ముందుకు వచ్చి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదన్నది బీఆర్‌ఎస్ నాయకుల విమర్శ. అన్ని సభల్లో ఫుల్ మెజార్టీ ఉన్న బీజేపీ దీన్ని ఆమోదించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ అన్న ప్రశ్నతో దీక్ష చేస్తోంది బీఆర్ఎస్ లీడర్ కవిత. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు భారీగాగా పార్టీ శ్రేణులు ఢిల్లీ చేరుకున్నాయి.
దీనికి పోటీగా లిక్కర్ స్కామ్‌ను తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. దోషులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోనే పార్టీ లీడర్లు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. వాళ్లు కూడా జంతర్ మంతర్ వద్దే ధర్నా చేస్తామని ముందు ప్రకటించారు. అంతకంటే ముందే కవిత దీక్షకు అనుమతి కోరి ఉన్న వేళ గురువారం కాసేపు సస్పెన్స్ నడిచింది. పోలీసులు ఎవరి కార్యక్రమానికి అనుమతి ఇస్తారనే ఉత్కంఠ సాగింది.
చివరి నిమిషంలో బీజేపీ తన ధర్నా ప్లేస్‌ను వేరే ప్రాంతానికి షిప్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కవిత దీక్షకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే బీజేపీ లిక్కర్ స్కామ్‌లో వివిధ పార్టీల నేతలు ఉన్నందున వారిపైనే ఫోకస్ పెట్టి ధర్నా చేస్తోంది.
ఢిల్లీలో అలా ఉంటే తెలంగాణలో కూడా బీజేపీ లీడర్లు మహిళ గోస బిజెపి భరోసా పేరుతో దీక్షకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నాయకులు. కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ఉదయం 11 గంటల నుంచి సా. 4 గంటల వరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో “తెలంగాణ మహిళా గోస - బిజెపి భరోసా దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ దీక్షలో డీకే అరుణ, విజయశాంతి ఇతర మహిళా నేతలు పాల్గొంటారని తెలిసింది బీజేపీ. ఇలా పోటాపోటీ ధర్నాలు, పోటాపోటీ కార్యక్రమాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రాజకీయ వేసవిని తలపిస్తోంది. గురువారమే ఇరు పార్టీల నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఆరోపణలు చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ అనేది రాజకీయ కక్ష సాధించడానికి చేస్తున్న విచారణగా బీఆర్‌ఎస్ ఆరోపిస్తే... తప్పు చేయనప్పుడు భయమెందుకని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు విమర్సలతో విరుచుకుపడుతున్న వేళ ఇప్పుడు ధర్నాలు దీక్షలతో ఆ వేడిని మరింత పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తున్నారు.