1.3 లక్షల కుటుంబాలకు రెండో విడత దళిత బంధు, పోడు భూముల పంపిణీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.  కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్ రావు మీడియా సమావేశంలో వివరించారు. ఈ మీడియా సమావేశంలో శాసనసభా వ్యవహారాలు, ఆర్ అండ్ బి శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖల మంత్రి గంగుల కమలాకర్, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
 
రాష్ట్ర కేబినెట్ తీర్మానాలు - మంత్రి టి.హరీశ్ రావు మీడియా సమావేశం - ముఖ్యాంశాలు :
- 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ :
-  రెండవ విడత కింద 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశలివ్వడం జరిగింది.
-  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ చేతుల మీదుగా 2021 ఆగస్టు 16 న లబ్దిదారునికి  10 లక్షల రూపాయల ఉచిత గ్రాంటునిచ్చే దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 16 వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది.
-  హుజురాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు పథకాన్ని అమలు చేయడం జరిగింది. 
-  మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1100 మందికి ఈ దఫాలో దళితబంధును అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ దఫా మొత్తంగా 1,29,800 కుటుంబాలకు దళితబంధును అమలు చేయడం జరుగుతుంది. మరో 200 మంది లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అప్పగించడం జరిగింది. మొత్తంగా 1,30,000 కుటుంబాలకు దళితబంధును అందించడం జరుగుతుంది. గతంలో మాదిరిగా జిల్లా కలెక్టర్లు లబ్దిదారులను ఎంపిక చేస్తారు.


సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద గ్రాంటు :
-  సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునే నిమిత్తం ఆర్థిక సాయం చేసే పథకానికి ప్రభుత్వం “గృహలక్ష్మి పథకం” గా పేరు నిర్ణయించింది.
-  గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించడమైంది.
-  ఒక్కొక్క నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని  నిర్ణయించడం జరిగింది.
-  ఇవే కాకుండా 43 వేల ఇండ్లు స్టేట్ కోటాలో పెట్టడం జరిగింది. 
-  మొత్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది
-  ఒక్కొక్క ఇంటికి గ్రాంటుగా 3 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కొక్క దఫా 1 లక్ష రూపాయల చొప్పున మూడు దఫాలుగా 3 లక్షల రూపాయలను గ్రాంటుగా వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
-   ఈ పథకానికి 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
-  మంజూరు చేసే ఇండ్లను మహిళ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది.
-  గత ప్రభుత్వాలు గృహనిర్మాణ సంస్థ ద్వారా పేద ప్రజలకు ఇండ్లు కట్టుకునేందుకు ఇచ్చిన 4 వేల కోట్ల రూపాయల అప్పులను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది.


రెండవ విడత  గొర్రెల పంపిణీ:
-  మొదటి దఫా గొర్రెల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 7,31,000 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగింది. ఇందులో 50 శాతం పంపిణీ గతంలోనే పూర్తయింది.
-  మిగతా 50 శాతం గొర్రెల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. దీనికోసం 4,463 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినేట్ తీర్మానించింది. 
-  ఈ పంపిణీ ప్రక్రియను ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగష్టు నెలలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో  ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరపాలని ఆదేశాలివ్వడం జరిగింది.


పోడు భూముల పంపిణీ :
-  రాష్ట్రంలో 4,00,903 ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రక్రియలన్నీ పూర్తయి ఈ పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
-  ఈ పంపిణీని వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. 
-  పోడు భూముల పంపిణీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.


ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రాహావిష్కరణ :
-  భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత,  భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. 
-  రాష్ట్రం నలుమూలనుంచి లక్షలాదిమంది దళితబిడ్డలను హైద్రాబాద్ కు ఆహ్వనించి వారి సమక్షంలో ఆవిష్కరించాలని, ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తాం.


జీవో 58, 59 పొడిగింపు :
-  జీవో 58, 59 లకు సంబంధించి మిగిలిన లబ్దిదారుల విజ్జప్తి మేరకు చివరి అవకాశంగా దరఖాస్తు సమయాన్ని నెలరోజులకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. 
-  ఇప్పటివరకు జీవో 58 ద్వారా 1,45,668 మందికి పట్టాలివ్వడం జరిగింది. 
-   జీవో 59 ద్వారా  42,000 మందికి  లబ్ధి చేకూర్చడం జరిగింది. కటాఫ్ తేది గతంలోని 2014 నుండి 2020 కి మారుస్తూ  పొడిగించాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో జీవో 58, 59 ద్వారా మిగతావారికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. 
-  గత ప్రభుత్వాలు పేదల ఇండ్లు కూల్చి, వాళ్ళు ఉసురు పోసుకున్నాయి.
-  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పట్టాలు తయారుచేసి వాళ్ళకందిస్తున్నది.


కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాల్లో వసతి గృహాల నిర్మాణం :
-  సనాతనధర్మాన్ని పాటించే ప్రతి వొక్కరూ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటారు. 
-  కాశీలో  మరణిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయని హిందువుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీ యాత్రకు విరివిగా భక్తులు వెళుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం అక్కడ వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. 60 వేల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు గాను రూ. 25 కోట్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 
-  ఇందుకు సంబంధించిన చర్యల కోసం, కాశీలో స్థలం ఎంపిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించి రావాలని తీర్మానించింది.
-  అదే విధంగా శబరిమలలో తెలంగాణ భక్తుల సౌకర్యార్థం కోసం అక్కడకూడా వసతి గృహాన్ని నిర్మించాలని తీర్మానించింది. ఇందుకు గాను 25 కోట్లు మంజూరు చేసింది.  సిఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ గారికి ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. తదనంతరం మంత్రుల బృందం వెళ్ళి అక్కడ పనులు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో సీఎం కేసీఆర్ కేరళ సీఎం గారితో ఈ విషయం పై చర్చించారు. 


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపాన్ని పనులు పూర్తయిన వెంటనే మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించడం జరుగుతుంది.  సొంత జాగా ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకంతో పాటు,  డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద ఇండ్ల నిర్మాణం, పంపిణీ జరుగుతూనే ఉంటుందని కేబినెట్ స్పష్టం చేసింది.