ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు సామాన్యుడు ఆందోళన చెందుతాడు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీలు దాటుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి సామాన్యులకు ఎదురవుతుంది. ఇంధన ధరలు పెరిగితే పరోక్షంగా పలు సర్వీసుల ఛార్జీలు, రవాణా లాంటి ఛార్జీలు పెరుగుతాయి. బ్యాకింగ్ రంగానికి సంబంధించిన పలు నిర్ణయాలు ఒకటో తారీఖు నుంచి అమలులోకి వస్తుంటాయి. కనుక ఆగస్టు 1వ తేదీ నుంచి మారనున్న అంశాలు తెలుసుకుని మీ నెలవారీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా ఛార్జీలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ జూన్ నెలలో ఇంటర్‌ఛేంజ్ ఏటీఎం సర్వీసుల ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఇది అమలులోకి రానుందని స్పష్టం చేసింది. ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలను రూ.15 నుంచి రూ.17కు పెంచుతూ ఆర్బీఐ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దాదాపు 9 ఏళ్ల తరువాత ఈ ఛార్జీలను పెంచారు. దాంతోపాటుగా నగదు రహిత లావాదేవిలపై ఛార్జీలను రూ.5 నుంచి రూ.6కు పెంపు నిర్ణయం సైతం నేటి నుంచి అమల్లోకి రానుంది.
ఐసీఐసీఐ కొత్త సర్వీస్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఐసీఐసీఐ ఖాతాదారులు ఇతర ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేస్తే ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, సేవింగ్ అకౌంట్స్ ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులకే కేవలం 4 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా అందిస్తోంది. 4 ఉచిత ట్రాన్సాక్షన్ దాటిన తరువాత ఒక్కో లావాదేవికిగానూ రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
వేతనాలు, ఈఎంఐ చెల్లింపులు
దేశంలో బ్యాంకులకే బ్యాంకు అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ( Reserve Bank of India) కొన్ని విషయాలు తెలిపింది. ద నేషనల్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏసీహెచ్) ఆగస్టు 1 నుంచి వారంలో అన్ని రోజులపాటు సేవలు అందించనుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. వినియోగదారుల సౌకర్యార్థం ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వేతనాల చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈఎంఐ రుణాల ప్రక్రియలో జాప్యం జరగకుండా ఉంటుందన్నారు. కరోనా కష్ట కాలంలో ఆటో ట్రాన్స్‌ఫర్ ప్రక్రియతో ప్రభుత్వ పథకాలు సజావుగా కొనసాగాయని చెప్పారు.
ఎల్పీజీ సిలిండర్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా ఎల్పీజీ ధరలపై నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా ప్రతి నెల మొదట్లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తున్నారు. సిలిండర్ బుక్ చేసుకునే వారు ధరలు తెలుసుకుని బుక్ చేసుకుంటే ఏ సమస్యా ఉండదు.
ఐపీపీబీ ఛార్జీలు సవరణ..
డోర్ స్టెప్ సర్వీసులకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తెలిపింది. ఒక్క డోర్ స్టెప్ సర్వీసుకుగానూ రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ ఛార్జీలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.