నల్గొండ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అప్పటికే పాతి పెట్టిన వ్యక్తి శవాన్ని తవ్వి తీసిన అమానవీయ ఘటన వెలుగు చూసింది. అంతేకాక, ఆ శవాన్ని రోడ్డుపై ఉంచారు. సాధారణంగా ఒకసారి పాతిపెట్టిన శవాలను కొన్ని సందర్భాల్లో పోలీసులు బయటికి తీయిస్తుంటారు. కొన్ని కేసుల విషయంలో విచారణ కోసం పాతి పెట్టిన మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహిస్తుంటారు. కానీ, ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఓ పెద్దావిడ శవాన్ని వెలికి తీసి రోడ్డుపై ఉంచడం విస్మయం కలిగిస్తోంది.
నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొండకింది గూడెం అనే గ్రామానికి చెందిన బుచ్చమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వారి సాంప్రదాయం ప్రకారం గ్రామం అవతల మృత దేహాన్ని శవ పేటికలో ఉంచి ఖననం చేశారు. అయితే, రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సమాధిలో నుంచి పాతిపెట్టిన మృత దేహాన్ని బయటకి తీసి బయట పడేశారు. శవ పేటికను గ్రామంలోని నడి రోడ్డుపై వదిలేశారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి, తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
కుటుంబ సభ్యులు మృతి చెందిన వృద్ధురాలిని వ్యవసాయ భూమిలోనే ఖననం చేశారు. దుండగులు శవాన్ని బయటికి తీసి బయట పడేయడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మానవత్వం జాలి, దయ, కరుణలాంటి గుణాలేవీ కనిపించకుండా వ్యక్తులు ప్రవర్తించడం పట్ల స్థానికంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవేళ స్థలం కోసం ఆ శవాన్ని ఎవరైనా బయటికి తీసి పడేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా భూ వివాదాల్లాంటివి ఉన్నాయా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. తమది కాని చోట మృత దేహాన్ని ఖననం చేసి ఉంటే ఇష్టపడని వారు ఇలా చేసి ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ అమానవీయ పని చేసినందుకు గల కారణాలు, కారకుల పేర్లు విచారణలో బయటికి వచ్చే అవకాశం ఉంది.
Also Read: Revanth Reddy: డబ్బుల్లేకపోతే సచివాలయం, ప్రగతి భవన్ అమ్మేయండి.. మేం మద్దతిస్తాం: రేవంత్ రెడ్డి