తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాల్సిందేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలతో పాటు గిరిజనులకు కూడా రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. అవసరమైతే డబ్బుల కోసం ప్రగతి భవన్‌ను, సచివాలయాన్ని కూడా అమ్మేయాలని, అందుకు తాము కూడా మద్దతు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇందిరాభవన్‌లో శనివారం (జులై 31) తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలైన సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
‘‘దళిత బంధు పథకాన్ని ఎవడు ఆపుతడో చూస్తానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నడు. ఎవ్వడూ ఆపడం లేదు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ దళిత బంధును అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నం. తాను మాట ఇస్తే అమలు చేసి తీరుతానంటూ కేసీఆర్ అంటున్నరు. రాష్ట్రంలో దళితులను మోసం చేసింది ఆయన కాదా? లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలోనూ దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహించనున్నాం. ఒక ప్రతి నియోజకవర్గంలో లక్ష మందితో ఈ సభలను పెట్టి రూ.10 లక్షలు ఇస్తావా.. చస్తావా అంటూ డిమాండ్ చేస్తాం. దీంతో టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో చావు డప్పు మోగిస్తాం’’ అని తెలిపారు. అనంతరం నాంపల్లిలోని కాంగ్రెస్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని కొట్టిపారేశారు.
ప్రభుత్వానికి దళిత బంధుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తామని ఏకవాక్య తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి మరో విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు.
సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజనులకు పంపిణీ చేసిన భూమిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అటవీ భూములకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో చేసిన చట్టాలు అమలయ్యేలా పోరాటం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. హరితహారం పేరుతో గిరిజన భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చెప్పిందేమీ ఇంతవరకు జరగలేదని గీతా రెడ్డి అన్నారు. జానారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేత సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.
Also Read: KCR NO ELECTION : హుజూరాబాద్ ఉపఎన్నికను కేసీఆర్ కోరుకోవట్లేదు..! ఇదిగో సాక్ష్యం..!