PM Modi Interacts with IPS Probationers: ప్రజలకు రక్షణ కల్పిస్తూ, నేరాలను అరికట్టడానికి తమ ప్రాణాలను సైతం పోలీసులు పణంగా పెడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నో రోజులు ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితిని పోలీసులు ఎదుర్కొంటున్నా, ప్రజలలో మాత్రం మీ ప్రస్తావన వస్తే ఏదో తెలియని వ్యతిరేక భావం కనిపిస్తుందన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పోలీసు (ఎస్‌వీపీ) అకాడమీలో శిక్షణ పొందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పండుగ సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉంటూ పోలీసులు అమూల్యమైన సేవలు అందిస్తారని, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారని పోలీసులను ప్రశంసించారు. ప్రాణాంతక కరోనా సమయంలో పోలీసులు చాలా గొప్ప పాత్ర పోషించారని, వారి త్యాగాలకు వెల కట్టలేమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయంటే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడికి వెళ్లి సేవలు అందిస్తారు. తమ ప్రాణాలకు తెగించి సిబ్బంది తమను రక్షిస్తారన్న భరోసా ప్రజల్లో కలిగిందన్నారు. ఎన్ని చేసినా పోలీసుల గురించిన ప్రస్తావన వస్తే మాత్రం ప్రజల అభిప్రాయాలు మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలలో పోలీసు వ్యవస్థపై ఉన్న ఆ కాస్త వ్యతిరేకత, భయం అనే భావన తొలగిపోవాలని, ఇందుకు పోలీసులే కీలకపాత్ర పోషించాలని ప్రధాని మోదీ సూచించారు.
ఏపీ కేడర్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారికి ప్రధాని మోదీ ప్రశ్న
ప్రధాని మోదీ తరహా వ్యక్తితో చర్చించే సమయం వస్తే చాలు అని ఎందరో యువత, అధికారులు భావిస్తుంటారు. ఈ క్రమంలో ప్రొబేషనరీ అధికారికి ఆ అవకాశం లభించింది. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వీటికి ఎలా అడ్డుకట్ట వేస్తారు, అరికట్టడానికి ఏం చేస్తారు? అని ఏపీ కేడర్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కొమ్మి ప్రతాప్ శివ కిశోర్‌ను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన కొమ్మి ప్రతాప్ శివ కిశోర్ ఏపీ కేడర్‌లో నియమితులయ్యారు. ప్రధాని మోదీ ప్రశ్నకు బదులిస్తూ... ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అయ్యిందని, సాంకేతికతను ఉపయోగించుకుని పోలీసు వ్యవస్థలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మానవ వనరుల కొరత ఉన్నా టెక్నాలజీని వినియోగించుకుని సమస్యలకు పరిష్కారం కనిపెట్టవచ్చునని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కొంతమేర నేరాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రతాప్ శివ కిశోర్.. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఫైనాన్షియల్, బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ చేశారు. బోస్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ నాలుగేళ్లు సేవలు అందించారు.
భారత్ 25 ఏళ్లలో 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుందని, ఆ సమయానికి మీరు ఎన్నో ప్రాంతాల్లో పనిచేసి అనుభవం సంపాదిస్తారని ప్రధాని మోదీ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులతో అన్నారు. నిత్యం ఎదురయ్యే కొత్త సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం కనిపెట్టాలని సూచించారు. నేరగాళ్లు సైతం కొత్త దారులు వెతుకుతున్నారని, వారి ఆ కట్టించాల్సిన పని మీదేనంటూ బాధ్యతల్ని గుర్తుచేశారు.