Salary Hike:
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఈ ఏడాది వీరి వేతనాలు 9-12శాతం వరకు పెరగనున్నాయి. ఎకనామిక్ టైమ్స్, సీల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. దాదాపుగా 350 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.
ఉద్యోగుల జీతాలు 9-12 శాతం వరకు పెరుగుతాయని 57 శాతం కంపెనీల హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్ తెలిపారు. 12 శాతానికి పైగా ఇంక్రిమెంట్లు ఇస్తామని 18 శాతం కంపెనీలు వెల్లడించాయి. అమెరికా బ్యాంకుల దివాలా ప్రభావం భారత ఆర్థిక పరిశ్రమపై అంతగా లేదని ఆయా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయపడ్డారు. హైరింగ్, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై ఇంపాక్ట్ ఉండబోదని స్పష్టం చేశారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లో (BFSI) అంతకు ముందు నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో టాలెంటెడ్, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ డిమాండ్ 50 శాతం పెరిగినట్టు జాబ్ పోర్టల్స్ డేటా ద్వారా తెలిసింది. డిజిటైజేషన్, కాంప్లియన్స్, సేల్స్ విభాగాల్లో డిమాండ్ ఉంది. టెక్నాలజీ, ప్రొడక్ట్, ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కాంప్లియన్స్ విభాగాల్లో అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగాయని సర్వే వెల్లడించింది.
'టెక్నాలజీ డిమాండ్, డిజిటైజేషన్‌పై ఫోకస్ బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్లో వృద్ధికి ప్రధాన కారకాలు. ఇందుకు ప్రతిభావంతులు అవసరం. దాంతో నాన్ ఐటీ ఇండస్ట్రీలో బీఎఫ్‌ఎస్‌ఐ ఉద్యోగాల సృష్టిలో ముందుంది' అని సీల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఈవో నారాయన్ మిశ్రా అన్నారు.
'డేటా ఆధారిత టెక్నిక్స్‌తో కస్టమర్ల అనుభవాన్ని మరింత మెరుగు పర్చడంపై ఫైనాన్స్ కంపెనీలు దృష్టి పెట్టాయి. మరిన్ని కంపెనీలు డిజిటల్ టెక్నాలజీస్, సరికొత్త బిజినెస్ మోడళ్లను అడాప్ట్ చేసుకొనే కొద్దీ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది' అని ఆయన పేర్కొన్నారు.
ఫ్రంట్‌లైన్ సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రీ సేల్స్, ఫ్రంట్‌లైన్ ఆపరేషన్స్ జాబ్స్ వంటి సపోర్ట్ రోల్స్‌కు డిమాండ్ పెరిగినట్టు సర్వే ద్వారా తెలిసింది. 'మొత్తం ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఎంతగానో దోహదం చేస్తాయి. రాబోయే కాలంలో బీఎఫ్‌ఎస్‌ఐ ఇండస్ట్రీ భవిష్యత్తు మరింత బాగుంటుంది' అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు.
'సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ల నుంచి సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ మేనేజర్లు, టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్లు, డొమైన్ నిపుణులను మేం నియమించుకుంటున్నాం. బ్యాంకింగ్ అప్లికేషన్లు తయారు చేయడంతో విస్తృత అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తున్నాం' అని కొటక్ మహీంద్రా బ్యాంకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిలింద్ నాగ్నుర్ అన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ పెంచుతామని యాక్సిస్ బ్యాంక్ హెచ్‌ఆర్ హెడ్ రాజ్‌కమల్ వేంపాటి అన్నారు. ఇతర కంపెనీలు ఇబ్బంది పడుతున్న తరుణంలో బీఎఫ్‌ఎస్‌ఐ మరింత ఆకర్షణీయంగా మారుతుందని తెలిపారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.