Kejriwal Removes Bureaucrat:
ఓ అధికారి తొలగింపు..
ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆశిష్ మోరెను ఆ పదవి నుంచి తొలగించారు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో చాలా మార్పులు చేర్పులు చేస్తానని ఇప్పటికే తేల్చి చెప్పారు కేజ్రీవాల్. అందుకు తగ్గట్టుగానే ఆ పని మొదలు పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన అభివృద్ధి పనులను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్న అధికారులను కచ్చితంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి వారిపై పూర్తి నిఘా పెడతామని తేల్చి చెప్పారు.
"అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే అధికారులపై ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో నిఘా పెడతాం. సరిగా పని చేయని అధికారులు ఏ స్థాయి వారైనా సరే తొలగిస్తాం. వారిపై క్రమశిక్షనా చర్యలు తీసుకుంటాం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
పలు సందర్భాల్లో అసహనం...
ఆ తరవాత ట్వీట్ కూడా చేశారు కేజ్రీవాల్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఆఫీసర్‌ల పోస్టింగ్ విషయంలో సర్వాధికారాలుంటాయని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే అధికారులు నడుచుకుంటారని వెల్లడించారు. అంతకు ముందు కేజ్రీవాల్ పదేపదే పలు ఆరోపణలు చేసేవారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కనీసం ఓ "ప్యూన్"ని బదిలీ చేసేందుకూ అధికారం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు. ఉన్నత స్థాయి అధికారులెవరైనా తన మాట వినేవారు కాదని చాలా సందర్భాల్లో విమర్శించారు. కేంద్ర హోం శాఖ చేతిలో కీలుబొమ్మలుగా పని చేస్తున్నారని మండి పడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పు..
ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రభుత్వ అధికారాలకు లోబడి పని చేయాలని తేల్చి చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పుని ధర్మాసనం తోసి పుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉండాలని వెల్లడించింది. శాసన, కార్యనిర్వాహక అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. అయితే..పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ వ్యవహారాల్లో మాత్రం ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలన్న నిబంధన వర్తించదని తెలిపింది. మిగతా అన్ని వ్యవహారాల్లోనూ ఢిల్లీ ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అయితే...2019లో కింది కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని వ్యవహారాలపై అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ఈ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. Article 239AA ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. అయితే...ఈ ఆర్టికల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం వర్తించదని వివరించింది. National Capital Territory of Delhi (NCTD)కి సంబంధించి అధికారాలను ఎన్నికైన ప్రభుత్వానికే బదిలీ చేయాలని తెలిపింది.
Also Read: Elon Musk: ట్విటర్ CEO ఛైర్‌లో మహిళ - మస్క్ మామ దిగిపోతున్నారా?