నువ్వులు చూసేందుకు చిన్నవి అయినా చేసే మేలు మాత్రం గట్టిగా ఉంటుంది. పూర్వం భారతీయుల ఆహారంలో నువ్వులు ఒక భాగంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి పలు ఆహర పదార్థాలు, డెజర్ట్ ల మీద డ్రెస్సింగ్ గా మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లతో నిండిన నువ్వులు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పోషకాల స్టోర్ హౌస్ గా వీటిని మెచ్చుకోవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం రోజుకి రెండు స్పూన్ల నువ్వు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 8 నుంచి 16 శాతం వరకు తగ్గించుకోవచ్చు. మొత్తం కొవ్వు శాతాన్ని 8 శాతం వరకు తగ్గించేస్తుంది.


నువ్వుల్లో విటమిన్ బి1, బి3, బి6 పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే ఐరన్ లోపం రాదు. రక్తహీనత సమస్య ఉన్న వారికి ఇవి మంచి పోషకాహారం. నలుపు, ఎరుపు నువ్వుల్లో ఇనుము నిండి ఉంటుంది. ఇక తెల్ల నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మెథియోనిన్, ట్రిప్టోఫాన్‌లను కలిగి ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు మంచి నిద్రను ప్రోత్సహించడంలో తోడ్పడతాయి. ఇందులో లెసిథిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. పాలిచ్చే తల్లులు రోజుకొక నువ్వుల లడ్డూ తింటే పాల నాణ్యత మెరుగుపడుతుంది.


మరిన్ని ప్రయోజనాలు


☀ నువ్వుల్లో ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకుంటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. జీర్ణక్రియకి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


☀ ఇందులో మెగ్నీషియం ఉంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్ ఇ, యాంటాక్సిడెంట్స్ నొప్పులను తగ్గిస్తాయి.


☀ ఎముకలు ధృడంగా ఉండేలా చేస్తాయి. ఇందులో కాల్షియం ఉంటుంది.


☀ షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. అధిక స్థాయిలో ప్రోటీన్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తాయి.


☀ జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ ఇ తో పాటు శరీరానికి అవసరమైణ పోషకాలు అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


☀ కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళు నువ్వులు తమ డైట్ లో భాగంగా చేసుకుంటే మంచిది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


☀ సెలీనియం ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల పనితీరు సరిగా జరిగేలా చేయడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది.


☀ మహిళలు మెనోపాజ్ దశకు చెరినప్పుడు హార్మోన్ల లోపంతో బాధపడటం సహజంగా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు నువ్వులు చక్కగా ఉపయోగపడతాయి. నువ్వుల్లో ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ తో సమానం. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోతాయి. వాటిని స్థాయులు మెరుగుపరుచుకునేందుకు నువ్వులు తింటే హెల్తీగా ఉంటారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: గ్రీన్ టీ, తేనెతో బరువు తగ్గొచ్చా?