ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల్లో గ్రీన్ టీ ఒకటి. బరువు తగ్గడానికి ఎక్కువ మంది తీసుకునే వాటిలో గ్రీన్ టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇది కాస్త ఘాటుగా ఉండటం వల్ల అందులో తేనె జోడించుకుని తీసుకుంటారు. మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది, రోగనిరోధక శక్తి ఇస్తుంది. చర్మ కాంతిని పెంచేందుకు సహకరిస్తుంది. గ్రీన్ టీ, తేనె కాంబినేషన్ ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ప్రత్యేకించి ఇందులో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందులోని మరొక పదార్థం అందరికీ ఇష్టమైన కెఫీన్. అయితే రెగ్యులర్ కప్పు కాఫీలో కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ కెఫీన్ కొవ్వుని కరిగించేందుకు, వ్యాయామ పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
తేనె ఒక అమృతం
సహజమైన స్వీటేనింగ్ ఏజెంట్. రోజుని ఉత్సాహంగా స్టార్ట్ చేయడానికి తేనె ఒక అద్భుతమైన ఎంపిక. శుద్ధి చేసిన చక్కెరకు ఇది గొప్ప ప్రత్యామ్నాయం. కొలెస్ట్రాల్ రహిత తేనె ఒక చెంచా తీసుకున్నా కూడా తీపి కోరికను అణిచి వేస్తుంది. స్థూలకాయాన్ని ఎదుర్కోవడంలో తేనె ప్రభావవంతంగా పని చేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. గోరు వెచ్చని నీటిలో చిటికెడు సున్నం, తేనె కలిపి తీసుకుంటే యాంటీ సెల్యులైట్ చికిత్సగా అద్భుతంగా పని చేస్తుంది. ఇది అడిపోసైట్స్‌పై పనిచేయడం ద్వారా శరీర బరువును తగ్గిస్తుంది. శక్తి తక్కువగా ఉండే వారికి స్టామినా స్థాయిలను పెంచుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
గ్రీన్ టీ చేదు లేకుండా ఇలా చేసుకోండి
ఏదైనా ఆహారం లేదా పానీయం రుచిగా లేకపోతే దాన్ని తీసుకోవడం కాస్త కాస్తమే. చాలా మంది గ్రీన్ టీ తాగాలని అనుకుంటారు కానీ దాని చేదు రుచి వల్ల ఇష్టపడరు. టీ కోసం వేడి నీటిని తీసుకుని అందులో తేనె కలుపుకుంటే అది కూడా చేదుకి దారి తీస్తుంది. అందుకే గ్రీన్ టీ ఆకులను నీటిలో 80 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా 3 నుంచి 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. అది కాస్త చల్లారిన తర్వాత ఒక స్పూన్ తేనె కలుపుకుంటే టీ రుచి చేదుగా ఉండదు.
గ్రీన్ టీ ప్రయోజనాలు
గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహులకు బెస్ట్ టీగా మారింది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల హైపర్లిపిడెమియా నుండి రక్షణగా ఉందని బలమైన ఎపిడెమియోలాజిక్ ఆధారాలు ఉన్నాయి. ఇది పేగుల్లోని కొవ్వుల శోషణ తగ్గిస్తుంది. రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే గుండె జబ్బుల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. దీని మేలైన ప్రయోజనాలు పొందాలంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. వేడి వేడి టీ తాగితే ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు తక్కువ. అలాగని ఈ టీ అతిగా తాగితే దుష్ప్రభావాలు ఉన్నాయి. శరీరంలో కెఫీన్ అధికంగా చేరిపోయి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: హిమాలయాల్లోని ఈ పువ్వుల రసం తాగితే ఎలాంటి రోగాలైనా నయమవుతాయా?