Twitte CEO: ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారు. X లేదా Twitterకు (X/Twitter) కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (CEO) దొరికినట్లు ఆయన ప్రకటించారు. ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు. మరో ఆరు వారాల్లో కొత్త సీఈవోను ప్రకటిస్తామని చెప్పారు.


ఎలోన్ మస్క్, 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేశారు, అప్పటి నుంచి ఆ కంపెనీ CEOగా కొనసాగుతున్నారు. కానీ, తాను ఆ సీట్లో తాను ఎక్కువ కాలం ఉండనని గతంలోనే ప్రకటించిన మస్క్‌, తన వారసుడి కోసం తెగ అన్వేషణ చేశారు. అయితే, మస్క్‌ మామ ఆలోచనలకు సరిపడే CEO దొరకలేదు. ఎలాన్ మస్క్ తాజా ప్రకటనను బట్టి చూస్తే, CEO కోసం సాగిన అన్వేషణ ముగిసినట్లుగా అర్ధం అవుతోంది. Twitter తదుపరి CEO ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది. 


ట్విట్టర్‌కు తాను శాశ్వత CEOను కాదని చెప్పిన ఎలాన్‌ మస్క్‌, కొత్త CEO వచ్చిన తర్వాత తన పాత్ర మారుతుందని చెప్పారు. ట్విట్టర్‌ కంటే ముందు నుంచే, ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రానిక్‌ కార్ల కంపెనీ టెస్లా CEOగా మస్క్‌ పని చేస్తున్నారు. ఇంకా, స్పేస్‌ ఎక్స్‌, ది బోరింగ్‌ కంపెనీ సహా చాలా కంపెనీల బాధ్యతలు కూడా ఆయన నెత్తిన ఉన్నాయి. కాబట్టి, ట్విట్టర్‌ CEO ఛైర్‌ నుంచి తప్పుకుంటానని చాలాకాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ట్విటర్‌ కోసం కేటాయించే తన సమయాన్ని క్రమంగా తగ్గించుకుని, ట్విట్టర్‌ను పూర్తి స్థాయిలో నడిపేందుకు మరొకరిని వెతుక్కోవాలని భావిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు.






ట్విట్టర్ సీఈవో ఒక మహిళ!
కొత్త CEO గురించి మస్క్‌ ట్వీట్‌ చేశారు. "ట్విట్టర్‌కి కొత్త CEOని తీసుకున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఆమె బాధ్యతలు 6 వారాల్లో ప్రారంభమవుతాయి" అని ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిని బట్టి, కొత్త సీఈవోను ఇప్పటికే నియమించారని, ఆ సీట్‌లోకి వచ్చేది ఒక మహిళ అని అర్ధం అవుతోంది. కొత్త సీఈవో వచ్చిన తర్వాత తన పాత్ర ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా (CTO) మారుతుందని, ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్, విభాగాల బాధ్యతలను తాను చూసుకుంటానని అదే ట్వీట్‌లో మస్క్‌ పేర్కొన్నారు.


ఎక్స్‌ యాప్‌లో ట్విట్టర్‌ విలీనం
ఇటీవల, ఒక కోర్టు కేసు విచారణ సందర్భంగా, ట్విటర్‌ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలో లేదని ఆ సంస్థ వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఎక్స్‌ అనే ఎవ్రీథింగ్‌ యాప్‌లో ట్విటర్‌ను కలిపేసినట్లు న్యాయస్థానానికి తెలిపింది. దీనిని ధృవీకరిస్తూ..  ‘X’ అక్షరాన్ని 11 ఏప్రిల్‌ 2023 నాడు మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఎక్స్‌ అనేది ఒక సూపర్‌ యాప్‌. ట్విటర్‌ను ఎక్స్‌ యాప్‌లో విలీనం చేయడం ద్వారా.. మెసేజింగ్‌, కాలింగ్‌, పేమెంట్స్‌ వంటి పనులన్నీ ఒకే యాప్‌ ద్వారా చేపట్టేలా చూడాలన్నది ఎలాన్‌ మస్క్‌ లక్ష్యం. ప్రస్తుతం, చైనాకు చెందిన ‘వీచాట్‌’ ఇదే తరహా సేవలను అందిస్తోంది. ఎక్స్‌ యాప్‌ను తన దీర్ఘకాల వ్యాపార ప్రణాళికగా మస్క్‌ అభివర్ణించారు.


ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను కొని నానా తిప్పలు పడుతున్న ఎలాన్‌ మస్క్‌, ఎట్టకేలకు ఆ నష్టాల నుంచి బయటపడే దారిలో ఉన్నారు. సోషల్ మీడియా సంస్థ "దాదాపు బ్రేకింగ్ ఈవెన్" స్థాయిలో ఉందని, ప్రకటనదార్లు (advertisers) చాలా మంది తిరిగి వచ్చారని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌ గతంలో చెప్పారు. ఒక వ్యాపారంలో ప్రారంభ నష్టాలు పూర్తిగా తగ్గి, లాభనష్టాలు లేని స్థితికి చేరడాన్ని బ్రేక్‌-ఈవెన్‌గా పిలుస్తారు. బ్రేక్‌-ఈవెన్‌ స్థితిని కూడా దాటితే, ఇక లాభాలు రావడం ప్రారంభం అవుతుంది.