Rupee Hits All-Time Low Of 80 Against Dollar: అనుకున్నదే జరిగింది! రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారి 80.06కు చేరుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తే పరిస్థితులు నెలకొనడం, రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో ముడి చమురు ధరలు పెరుగుదల అన్ని దేశాల కరెన్సీ విలువను దెబ్బతీశాయి. అమెరికా బాండ్‌ యీల్డులు ఎక్కువ రాబడి ఇస్తుండటంతో మన ఈక్విటీ మార్కెట్ల నుంచి 30 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ముడి సరకుల ధరలు పెరగడం, సరఫరా ఆటంకాలు తలెత్తడం రూపాయి క్షీణతకు కారణాలని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.


బంగారం దిగుమతులు, ముడి చమురు ఎగుమతులపై పన్నులు వేయడం, మార్కెట్‌ నుంచి నగదు ఉపసంహరించడం, వడ్డీరేట్లు పెంచడం ద్వారా రూపాయి క్షీణతను అడ్డుకొనేందుకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపుతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలు ఒత్తిడికి లోనయ్యాయి. మిగతా వాటితో పోలిస్తే మన రూపాయే కాస్త తక్కువ క్షీణించింది.



కథ ఇంకా మిగిలే ఉంది!


'రూపాయి క్షీణత ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ బలహీనంగానే ఉంది' అని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ ఎఫ్ఎక్స్‌ స్ట్రాటజిస్టు, ఎకానమిస్టు ధీరజ్‌ నిమ్‌ తెలిపారని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది. 'ముడి చమురు ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు కొనసాగడం పరోక్ష ఒత్తిడికి కారణమవుతోంది. వాణిజ్య లోటు పెరుగుతోంది' అని ఆయన అన్నారు.


భారత కరెంట్‌ ఖాతా లోటు పెరగడంతో ఈ ఏడాది రూపాయి 7 శాతం వరకు క్షీణించింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక ఏడాదిలో జీడీపీలో కరెంటు ఖాతా లోటు 2.9 శాతానికి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది కన్నా రెట్టింపు స్థాయికి పతనం చేరుకుంది. రూపాయి విలువ మరింత క్షీణించి సెప్టెంబర్లో 82కు చేరుకుంటుందని నొమురా హోల్డింగ్స్‌, మోర్గాన్‌ స్టేన్లీ అంచనా వేస్తున్నాయి.


ఒడుదొడుకుల నుంచి మార్కెట్లను రక్షించేందుకు, రూపాయి క్షీణతను అడ్డుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత నెల్లో అన్నారు. 'రూపాయి క్షీణతకు ఒక స్థాయిని నిర్దేశించుకోలేదు. అయితే కరెన్సీ పెరుగుదల, తగ్గుదల ఒక క్రమపద్ధతిలో ఉండాలని అనుకుంటున్నాం' అని సింగపూర్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. జూన్‌ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 13 నెలల కనిష్ఠమైన 588.3 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ ఇంతకు ముందే ప్రకటించింది.


Also Read: 80కి రూపాయి! ఏ షేర్లు లాభపడతాయి! ఎవరికి నష్టం!!


Also Read: డాలర్‌ సల్లగుండా! 81కి పడిపోనున్న రూపాయి - కారణాలు ఇవేనన్న విశ్లేషకులు