Godavari River Floods: అకస్మాత్తుగా వచ్చిన గోదావరి వరదలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా ఉన్నా.. అంతకు మించి వరదలు రావడంతో వేల టీఎంసీల నీరు సముద్రంపాలైంది. ఇప్పుడు కృష్ణాకు వరద మొదలైంది. కృష్ణా నదికి వస్తున్న వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతోంది. అక్కడినుంచి మిగతా ప్రాజెక్ట్ లకు నీటిని ముందుగానే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్ట్ కి చేరుకుంటుంది. అంటే ఇక్కడ నిల్వచేయడంతోపాటు, కండలేరుకి కూడా దాన్ని తరలించే అవకాశముంది. గతేడాది పడిన వర్షాలకు సోమశిలలో సంతృప్తికర స్థాయిలో నీరు ఉంది. ఇప్పుడు కృష్ణా నీరు కూడా వస్తే రైతులకు సంతోషమే. కానీ ఈ వరదనీటిని ఎంత సమర్థంగా వినియోగించుకోగలరనేదే ఇప్పుడు ప్రశ్న.
గోదావరి ఉప్పెన ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ప్రస్తుతం కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది, ఇక పెన్నా నదే తరువాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు చేరుతోంది. సోమవారం నాటికి 3.27 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. రోజుకు 25 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్ట్ కి వస్తున్నాయి. ఇదే ఉద్ధృతి మూడు రోజులు కొనసాగితే శ్రీశైలం పూర్తి సామర్థ్యం అయిన ఫుల్ ట్యాంక్ లెవల్ 215 టీఎంసీలకు నీరు చేరుకుంటుంది. అయితే కాస్త ముందుగానే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. సోమవారం నీరు విడుదలైంది. సోమశిలకు ఆ నీరు వచ్చేసరికి అయిదు రోజులు సమయం పడుతుంది. సోమశిలకు అనుసంధానంగా ఉన్న కండలేరు జలాశయంలో ప్రస్తుతం 31 టీఎంసీల నీరు ఉంది. అక్కడికి మరో 25 టీఎంసీలు తరలించి నిల్వ చేసే అవకాశం ఉంది. సోమశిల 60 టీఎంసీలు దాటిన తర్వాత.. కండలేరు ప్రాజెక్ట్ కి నీటిని విడుదల చేస్తామంటున్నారు అధికారులు.
సోమశిలలో ఇప్పటికే 55.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా పరివాహక ప్రాంతం కడప, నెల్లూరు జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు పడుతున్నాయి. దీంతో సహజంగానే నీటి ప్రవాహం పెరిగే అవకాశముంది. వర్షాల వల్ల పంట కాల్వలపై రైతులు ఆధారపడే అవకాశం కూడా తక్కువ. శ్రీశైలం నుంచి తెలుగుగంగ పథకం ద్వారా సోమశిలకు నీరు వదులుతున్నారు కాబట్టి.. పెన్నా నది వరదలతో సంబంధం లేకుండా సోమశిల నిండుతుంది. మరో 15 రోజుల్లో సోమశిల ప్రాజెక్ట్ నీటి నిల్వ 70 టీఎంసీలు దాటుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు సంతోషకరమైన విషయమే. అయితే ఈ నీటిని అధికారులు ఎంత జాగ్రత్తగా వినియోగించగలరనేదే ఇప్పుడు ప్రశ్న.
గతేడాది చివర్లో పెన్నా వరదలతో నెల్లూరు జిల్లా ప్రాంతం అతలాకుతలమైంది. అయితే సోమశిల ప్రాజెక్ట్ నీటిని కిందకు విడుదల చేసే విషయంలో అధికారులు అజాగ్రత్తగా ఉన్నారని, అందుకే ఈ సమస్య వచ్చిందనే అపవాదు కూడా ఉంది. ఒకేసారి నీటిని కిందకు విడుదల చేయడం, ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడంతో నెల్లూరు పట్టణంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయని అంటున్నారు. ప్రస్తుతం సోమశిల ఆప్రాన్ పనులు కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పనులకు ఆటంకం కలగకుండా ఉండాలన్నా, ఒకేసారి పెన్నాకు నీటిని విడుదల చేయకూడదు. ముందుచూపుతో విడతల వారీగా నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అటు సంగం బ్యారేజ్ కూడా వినియోగంలోకి వచ్చే అవకాశముంది కాబట్టి.. సంగం బ్యారేజ్ వద్ద నీటిని నిల్వచేసే అవకాశముంది. ప్రస్తుతం అధికారులు ఈ విషయంపై దృష్టిపెట్టారు.