Southwest Monsoon: ఏపీ, తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కువరనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం రాయ్‌పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని.. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో నేడు సైతం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షలో తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలుండగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో, కర్నూలు జిల్లాలోని కొన్ని చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయి.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 5 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.