దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి (Dakshinayana Punyakalam)
సూర్య గమనం ఆధారంగా కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. అంటే ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం...కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పుకున్నా..సరిగ్గా గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు..కేవలం ఏడాదిలో రెండురోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు... అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగిలిన ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. 


Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!


సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం.  ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు.అందుకే ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ప్రత్యేక ఉపవాసాలు, పూజలు చేస్తారు. అందుకే ఇది ఉపాసన కాలం అయింది. ఈ సమయంలోనే యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షచేపడతారు. ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు.



శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి...


ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.  ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు.  బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం మాత్రమే కాదు...కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.


Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి