Rupee vs Dollar: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేయగలవ్‌! అంటే ఈ మధ్య కాలంలోనైతే పడిపోతాను అంటోంది! రెండేళ్ల క్రితం కరోనా, కొన్ని నెలల క్రితం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కొన్ని రోజులు క్రితం మొదలైన ద్రవ్యోల్బణం కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే సమయంలో రూపాయి విలువ పతనమవ్వడం అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే 80కి చేరుకున్న రూపాయి 81కి చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.


ఆసియాలో స్థిరంగా రూపాయి!


కొన్ని వారాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రూపాయి విలువ స్థిరంగానే కదలాడింది. మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే బలంగానే ఉంది. వర్ధమాన దేశాల కరెన్సీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శనే చేస్తున్నా డాలర్‌తో మాత్రం పోటీపడలేకపోతోంది. అందుకే త్వరలోనే రూ.81కి చేరుకోవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ కరెన్సీ రీసెర్చ్‌ ఉపాధ్యక్షుడు సుగంధ సచ్‌దేవా అంటున్నారు.


పెట్టుబడుల భద్రత కోసం


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా వంటి సురక్షితమైన గమ్యస్థానాలకు మళ్లిస్తున్నారు. డాలర్‌దే ఆధిపత్యం కాబట్టి తమ కరెన్సీ విలువను రక్షించుకోవాల్సి అవసరం యూఎస్‌కు లేదు. స్థిరంగా ఉన్న మార్కెట్ కావడంతో యుద్ధం తర్వాత ఇన్వెస్టర్లు పెట్టుబడులను అక్కడికి తరలిస్తున్నారు. రూపాయి పతనానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు ఇన్ఫోమెరిక్స్‌ రేటింగ్స్‌ ఎకానమిస్ట్‌ బంధోపాధ్యాయ.


అమెరికాలో మెరుగైన రాబడి


విదేశీ కరెన్సీ ప్రవాహం కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే చర్యలు తీసుకుంది. కొన్నేళ్లుగా వచ్చిన నష్టాలు భర్తీ అవ్వాలంటే సమయం పడుతుంది. భారత్‌లో పెట్టుబడులతో పోలిస్తే అమెరికా బాండ్‌ యీల్డుల రాబడి ఎక్కువగా ఉంది. అందుకే ఇన్వెస్టర్లు అటువైపు పరుగెడుతున్నారు. అమెరికాలో 2-5 ఏళ్ల డిపాజిట్లపై 3 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వస్తోంది. మరోవైపు భారత్‌లో ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బి) డిపాజిట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి.


ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు


ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు యూఎస్‌ ఫెడ్‌ దూకుడుగా వడ్డీరేట్లను పెంచుతోంది. వచ్చే సమావేశంలో 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచేందుకు సిద్ధమైంది. వడ్డీరేట్ల పెరుగుదల డాలర్‌ బలం పెంచుతోంది. మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు కోసం భారత కంపెనీలు డాలర్లనే ఉపయోగిస్తుండటంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ఇది మన కరెన్సీ విలువను దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉండటంతో డాలర్‌ బలపడుతోంది. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది.


అరువు తెచ్చుకున్న ఇన్‌ఫ్లేషన్‌


పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం ఎకానమీని ఇబ్బంది పెడుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరిగింది. చాలా దేశాల కరెన్సీలను దెబ్బకొట్టింది. అందుకే ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం ఆగడం లేదు.