Rupee vs Dollar: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ మరింత బలపడుతోంది. ఆ దెబ్బకు అన్ని దేశాల కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. మన రూపాయీ ఇందుకు భిన్నమేమీ కాదు. డాలర్‌తో పోలిస్తే జీవిత కాల కనిష్ఠమైన 80ని తాకేందుకు సిద్ధంగా ఉంది! కొందరు విశ్లేషకులైతే 81కి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు.
రూపాయి మారకం విలువను స్టాక్ మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తుంటాయి. ఎంత మేర పెరుగుతోంది? ఎన్ని పాయింట్లు తగ్గుతోందని ప్రతి క్షణం పరిశీలిస్తుంటాయి. రూపాయి విలువను పరిగణనలోకి తీసుకొని ఇక్కడి కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు చేపడుతుంటారు. రూపాయి జీవిత కాల కనిష్ఠానికి చేరువవుతుండం ఏ షేర్లకు లాభం? ఎవరి నష్టమో ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎగుమతులకు మంచిది. దిగుమతులకు చెడ్డది!!
ఎవరికి లాభం?
రూపాయి విలువ పతనంతో ఎక్కువగా లాభపడేది ఐటీ కంపెనీలే. వారి ఆదాయాల్లో సగభాగం డాలర్ల రూపంలోనే ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తుండటమే ఇందుకు కారణం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా, మైండ్‌ట్రీ వంటి కంపెనీలకు డాలర్ రెవెన్యూ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ఐటీషేర్లు స్థాయికి మించి దిద్దుబాటుకు గురయ్యాయి. ఇంకా కన్సాలిడేషన్ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఐటీ షేర్లను కొనుగోలు చేయడం మంచిదని అవెండస్ క్యాపిటల్ సీఈవో ఆండ్రూ హొలండ్ చెబుతున్నారు. తక్కువ ధర, పీఈ నిష్పత్తికే షేర్లు దొరుకుతున్నాయని వెల్లడించారు.
టీసీఎస్ రాబడిలో 60 శాతం అమెరికా నుంచే వస్తుందని, హెచ్‌సీఎల్‌కు 55 శాతం వస్తోందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అమెరికా, ఐరోపాలో ఆర్థిక మాంద్యం భయాలు ఉండటంతో షేర్ల కొనుగోళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా రూపాయి పతనం వల్ల దివీస్ లేబోరేటరీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వంటి ఎగుమతి కంపెనీలకూ లాభమే.
ఎవరికి నష్టం?
రూపాయి పతనం వల్ల దిగుమతులపై ఆధారపడిన కంపెనీల లాభాలు, మార్జిన్లు తగ్గుతాయి. ముడి వనరులకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏసియన్ పెయింట్స్ ప్రధాన ముడి వనరు క్రూడాయిల్. దానిని కొనుగోలు చేయడానికి డాలర్లే అవసరం. ఈ కంపెనీ ప్రత్యర్థి బర్జర్ పెయింట్స్‌దీ ఇదే సమస్య. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఆస్ట్రల్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ కంపెనీలపైనా ఆ ప్రభావం ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.