Reliance Industries Market Cap Crosses Rs 20 Lakh Crore: దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డ్ సృష్టించింది. మన దేశంలో, 20 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ దాటిన తొలి కంపెనీగా రిలయన్స్ ఘనత సాధించింది. గత వారం రోజులుగా కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం, 13 ఫిబ్రవరి 2024), రిలయన్స్ షేర్ ధర BSEలో తాజా 52 వారాల గరిష్ట స్థాయి రూ. 2957.80 కి చేరుకుంది, ఈ ఒక్క రోజే 1.89 శాతం పెరిగింది. దీంతో, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 20 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.
2 వారాల్లోనే రూ.లక్ష కోట్లు విలువ
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ గత రెండు వారాల్లోనే సుమారు లక్ష కోట్ల రూపాయలు పెరిగింది. RIL స్టాక్ 2024 జనవరి 29 నాటికి రూ. 19 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 సంవత్సరంలో రిలయన్స్‌పై పెట్టుబడిదార్లలో మంచి సెంటిమెంట్ కనిపిస్తోంది, ఈ కంపెనీ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 14 శాతం మేర పెరిగాయి.
ఏడాదిలో 40 శాతం జంప్
గత ఏడాది కాలంగా (గత 12 నెలలుగా) రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో అప్‌వార్డ్ ట్రెండ్ ఉంది. కంపెనీ అద్భుతమైన పనితీరు కారణంగా గత 12 నెలల్లో ఈ షేర్లు దాదాపు 40 శాతం మేర పెరిగాయి. RIL అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ది ఇందులో గణనీయమైన పాత్ర. ఈ 12 నెలల కాలంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.1.70 లక్షల కోట్లు పెరిగింది.
2015 నుంచి పెరుగుతూనే ఉన్న రిలయన్స్ షేర్లు
ఏడాది ప్రాతిపదికన చూస్తే.. 2014 సంవత్సరంలో రిలయన్స్ షేర్లు 0.5 శాతం క్షీణించాయి. ఇక ఆ తర్వాత ఏ ఏడాదిలోనూ తగ్గింది లేదు. 2015 నుంచి 2023 వరకు, ప్రతీ సంవత్సరమూ పెట్టుబడిదార్లకు సానుకూల రాబడిని అందిస్తూ వచ్చింది.
రెండు రోజుల్లో రెండు ఘనతలు
20 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ రికార్డ్‌కు ముందు రోజు, హురున్ ఇండియా 500 లిస్ట్‌లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధిపత్యం కూడా కనిపించింది. మార్కెట్ విలువ పరంగా వరుసగా మూడో ఏడాది కూడా ఆ జాబితాలో RIL మొదటి స్థానంలో నిలిచింది.
హురున్ ఇండియా 500 లిస్ట్‌లో... రూ.15 లక్షల కోట్లతో TCS రెండో స్థానంలో, HDFC రూ.10.5 లక్షల కోట్లతో మూడో స్థానంలో, ICICI బ్యాంక్ రూ.7 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ రూ.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఐదో స్థానంలో ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పేటీఎం పాలిట దేవుళ్లలా దిగొచ్చిన పెద్ద బ్యాంక్‌లు, కష్టకాలంలో అభయహస్తం