Paytm Crisis: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సంక్షోభ సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన ఆపన్న హస్తాన్ని చాచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదిస్తే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో ‍‌(Paytm Payments Bank) కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు యాక్సిస్ బ్యాంక్ ‍‌(Axis bank) ఎండీ & సీఈవో అమితాబ్ చౌదరి ‍‌ప్రకటించారు. దీనికిముందు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు (HDFC bank) చెందిన పరాగ్ రావ్ కూడా పేటీఎంతో చర్చలు జరుపుతున్నట్లు ధృవీకరించారు.


ఆర్‌బీఐ ఓకే చేస్తే కలిసి పని చేస్తాం
పేటీఎంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమితాబ్ చౌదరి (Amitabh Chaudhry) సోమవారం చెప్పారు. "అయితే, అది నియంత్రణ సంస్థ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర బ్యాంక్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే, మేము ఖచ్చితంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఆర్థిక రంగంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక ముఖ్యమైన కంపెనీ" అన్నారు. హురున్ & యాక్సిస్ బ్యాంక్ రూపొందించిన హురున్ ఇండియా 500 లిస్ట్‌ను విడుదల చేసిన సందర్భంగా అమితాబ్‌ దౌదరి మీడియాతో మాట్లాడారు. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి.


హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ కూడా రెడీ
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో కలిసి పని చేయాలని తాము భావిస్తున్నట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన పరాగ్ రావ్ ‍‌(Parag Rao) ఇటీవల చెప్పారు. "పేటీఎం గ్రూప్‌పై వస్తున్న అప్‌డేట్స్‌ను మేము గమనిస్తున్నాం. కొత్త విషయాల గురించి కూడా  పేటీఎంతో మాట్లాడుతున్నాం. PPBLపై ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌లో కస్టమర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది" అని చెప్పారు.


ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), సోమవారం, పేటీఎం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ విధించిన ఆంక్షల గురించి సమీక్షించే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. పేటీఎం కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు కుండ బద్ధలు కొట్టారు. తాము ఆషామాషీగా ఒక నిర్ణయాన్ని తీసుకోబోమని కూడా దాస్‌ చెప్పారు. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు.


2024 మార్చి 01 నుంచి డిపాజిట్లు, ఫండ్ బదిలీలు, డిజిటల్ వాలెట్‌లతో సహా అన్ని కార్యకలాపాలను ఆపేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను 2024 జనవరి 31న ఆర్‌బీఐ ఆదేశించింది.


ఈ రోజు (మంగళవారం, 13 ఫిబ్రవరి 2024) ఉదయం 10.40 గం. సమయానికి, పేటీఎం షేర్లు 7.43% పతనంతో రూ.390.85 దగ్గర ట్రేడ్‌ అవుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఓ కస్టమర్‌ కోపం - కోర్ట్‌ మెట్లు ఎక్కనున్న జొమాటో