Zomato Gets Court Notice: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకుని ఇంటింటికి ఆహారాన్ని సరఫరా చేసే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు ఒక సంకట పరిస్థితి ఎదురైంది. దిల్లీలోని ఒక సివిల్‌ కోర్టు, జొమాటోకు సమన్లు జారీ చేసింది. 


దేశ రాజధాని దిల్లీలో జొమాటో సేవలను నిషేధించాలని, ప్రముఖ రెస్టారెంట్‌ల ఫుడ్‌ కోసం జొమాటో యాప్‌ ద్వారా ప్రజలు ఆర్డర్‌ పెట్టకుండా ఆపాలని కోరుతూ ఒక వ్యక్తి సివిల్‌ దావా వేశారు. ఆ దావాపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, జొమాటోకు నోటీస్‌ జారీ చేసింది.


అసలు విషయం ఇదీ
గురుగావ్‌కు చెందిన సౌరవ్‌ మాల్‌, జొమాటో కస్టమర్‌. అయితే, ఆయనకు జొమాటో సేవల మీద అనుమానం & కోపం వచ్చాయి, అందుకే కేసు పెట్టారు. జొమాటోకు 'దిల్లీ కీ లెజెండ్స్' పేరిట ఒక సబ్‌ బ్రాండ్‌ ఉంది. ఈ బ్రాండ్‌ ద్వారా, దిల్లీలోని ప్రసిద్ధ రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తీసుకుని, దిల్లీ సహా చుట్టుపక్కలున్న గురుగావ్‌, నోయిడాలోని ప్రాంతాలకు డెలివరీ చేస్తుంది. 


సౌరవ్ మాల్, గత ఏడాది అక్టోబర్ 24న.. జామా మసీదు, కైలాష్ కాలనీ, జంగ్‌పురాలోని మూడు వేర్వేరు రెస్టారెంట్ల నుంచి ఆహారం కోసం ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత, అక్కడ డెలివెరీ పార్ట్‌నర్‌ (ఫుడ్‌ కోర్ట్‌/ హోటల్‌/ రెస్టారెంట్‌) ఉందో, లేదో చెక్‌ చేసేందుకు ట్రాక్ చేశారు. అయితే.. అక్కడ జొమాటో డెలివెరీ పార్ట్‌నర్‌ లేదు. డెలివెరీ బాయ్‌ మాత్రం ఫుడ్‌ తీసుకుని వచ్చాడు. తాను ఆర్డర్‌ ఇచ్చిన ఆహారాన్ని అసలు రెస్టారెంట్ నుంచి కాకుండా గుర్తు తెలియని ప్రదేశం నుంచి జోమాటో డెలివరీ బాయ్‌ తీసుకువచ్చినట్లు సౌరవ్‌ మాల్‌ గుర్తించాడు. దీంతో, జొమాటో సర్వీస్‌పై అతనికి కోపం వచ్చింది. తాను ఆర్డర్‌ ఇచ్చిన రెస్టారెంట్‌ నుంచి కాకుండా ఇతర ప్రాంతం నుంచి ఫుడ్‌ తెచ్చారని, ఫుడ్‌ డెలివెరీలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జొమాటో మీద కోర్ట్‌లో వ్యాజ్యం దాఖలు చేశారు.


ప్రశ్నల వర్షం కురిపించిన సౌరవ్‌ మాల్‌
రెస్టారెంట్ పార్టనర్ బ్రాంచ్ లేని ప్రదేశం నుంచి ఆహారాన్ని ఎలా తీసుకున్నారు, రెస్టారెంట్ భాగస్వామి అసలు ప్యాకేజింగ్‌లో ఆహారం ఎందుకు డెలివరీ చేయడం లేదని తన పిటిషన్‌లో సౌరవ్ మాల్ ప్రశ్నించారు. తన కోసం తీసుకువచ్చిన ఆహారం అసలు రెస్టారెంట్‌ పార్ట్‌నరే తయారు చేసిందని గ్యారెంటీ ఏంటని నిలదీశారు. అసలు అక్కడ ఆహారం నాణ్యంగా, తాజాగా, వేడిగా తయారవుతుందని హామీ ఏంటి? అని కూడా ఆ వ్యాజ్యంలో అనుమానం వ్యక్తం చేశారు.


సౌరవ్ మాల్ ప్రశ్నల పరంపర అక్కడితోనే ఆగలేదు. దిల్లీలోని ప్రసిద్ధ రెస్టారెంట్‌ల నుంచి గురుగావ్‌, నోయిడాలోని లొకేషన్‌లకు జొమాటో 30 నిమిషాల్లోనే ఫుడ్‌ ఎలా డెలివెరీ చేస్తోందని, అసలు ఈ పని సాధ్యమేనా అని తన అనుమానాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. వ్యాపారం చేయడానికి అడ్డదార్లు తొక్కుతున్న జొమాటో, తన పోషకులైన వినియోగదార్లను దారుణంగా మోసం చేస్తోందని ఆరోపించారు.


తనలాంటి అనేక మంది బాధితుల తరపు ప్రతినిధిగా, సివిల్ ప్రొసీజర్ కోడ్ (CPC) కింద ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వ్యాజ్యంలో వివరించిన సౌరవ్ మాల్.. దేశ రాజధానిలో జొమాటో సేవలను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సౌరవ్‌ మాల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సివిల్‌ కోర్డు, ఫిర్యాదిదారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జొమాటోను ఆదేశిస్తూ నోటీస్‌ జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది.


మరో ఆసక్తికర కథనం: పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ - ఒకరు ఔట్‌, రంగంలోకి సెంట్రల్‌ గవర్నమెంట్‌!