Paytm Director Resigns: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL) మీద ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న పేటీఎంపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. PPBL బోర్డ్‌కు ఒక స్వతంత్ర డైరెక్టర్‌ రాజీనామా చేశారు. నేషనల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమేనని పేటీఎం కూడా ఒప్పుకుంది. తన బ్యాంకింగ్ విభాగం నుంచి స్వతంత్ర డైరెక్టర్ మంజు అగర్వాల్‌ రాజీనామా చేసినట్లు ధృవీకరించింది.


పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌ మంజు అగర్వాల్‌, తన వ్యక్తిగత కారణాల వల్ల 2024 ఫిబ్రవరి 01న బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం తెలిపింది.


పేటీఎంలో చైనా పెట్టుబడులపై ఆరా!
PTI రిపోర్ట్‌ ప్రకారం, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లో (PPSL) చైనా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (FDI) కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. పీపీఎస్‌ఎల్‌లో చైనా పెట్టుబడులను ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పరిశీలిస్తోందని, సమగ్ర పరిశీలన తర్వాత ఎఫ్‌డీఐ అంశంపై నిర్ణయం తీసుకుంటారని పీటీఐ నివేదించింది. PPSL, పేమెంట్‌ అగ్రిగేటర్‌గా పని చేసే లైసెన్స్ కోసం 2020 నవంబర్‌లో రిజర్వ్ బ్యాంక్‌కు దరఖాస్తు చేసింది. నిబంధనల సంబంధిత కారణాలతో అప్పుడు ఆ దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించడంతో, 2022 డిసెంబరు 14న ఆ కంపెనీ మళ్లీ దరఖాస్తు చేసుకుంది. 


గత వారం, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (RBI MPC) నిర్ణయాల ప్రకటన సందర్భంగా, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేటీఎం ఇష్యూ మీద స్పందించారు. చేసిన తప్పును బట్టి చర్యలు ఉంటాయని, ఎంత పెద్ద తప్పు చేస్తే అంత పెద్ద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు.


ఈ నెల 29 తర్వాత కొత్త కస్టమర్‌లను యాడ్‌ చేయకుండా & కొత్త క్రెడిట్ బిజినెస్‌ చేయకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ఆంక్షలు విధించింది. మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తాము ఎక్కడా హద్దు మీరలేదని చెబుతున్న పేటీఎం పేరెంట్ వన్ 97 కమ్యూనికేషన్స్ (One97 Communications Limited), పేటీఎం గ్రూప్‌ కంపెనీల్లో రూల్స్‌కు అనుగుణంగా పాలన జరిగేలా చూసేందుకు SEBI మాజీ ఛైర్మన్ M దామోదరన్ నేతృత్వంలో ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ICAI మాజీ ప్రెసిడెంట్ MM చితాలే, ఆంధ్ర బ్యాంక్ మాజీ ఛైర్మన్ రామచంద్రన్ వంటి అనుభవజ్ఞులను కమిటీలో నియమించింది.


ఆర్‌బీఐ కఠిన ఆంక్షల మధ్యే, ఈ ఫిన్‌టెక్ కంపెనీ, బెంగళూరుకు చెందిన చేసే ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ 'బిట్సిలా'ను (Bitsila) కొనుగోలు చేయడబోతోంది. ఈ డీల్‌ ఈ వారంలో పూర్తి కావచ్చని తెలుస్తోంది. ONDCలో పనిచేస్తున్న ఇంటర్‌ఆపరబుల్ ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ బిట్సిలా. లావాదేవీల పరంగా చూస్తే, ఓఎన్‌డీసీలో సెల్లర్స్‌ తరపున వ్యవహరిస్తున్న మూడో అతి పెద్ద కంపెనీ ఇది. 


ఈ రోజు (సోమవారం 12 ఫిబ్రవరి 2024) మధ్యాహ్నం 1.10 గంటల సమయానికి పేటీఎం షేర్‌ ధర రూ.9.65 లేదా 2.30% పెరిగి రూ.429.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొంటే ఎంత సంపాదించొచ్చు? ఇదిగో కాలుక్యులేటర్‌