Chalo Delhi : పంటకు కనీస మద్ధతు ధర చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీ చలో మార్చ్‌కు పిలుపునిచ్చాయి. వేలాది మంది రైతులు ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతతో ఢిల్లీని దుర్భేధ్యంగా మార్చేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హర్యానా సరిహదద్దుల్లో భారీగా భద్రతా ఏర్పాట్లను చేసిన అధికారులు.. వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిషేదాజ్ఞలను అమలు చేస్తున్నారు. వాహనాల ప్రవేశాలను అడ్డుకునేందుకు అనుగుణంగా పోలీసులు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. టోహనా బోర్డర్ వద్ద ఇసుక కంటైనర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్లపై ఏర్పాటు చేశారు. రైతుల ఢిల్లీ చలో మార్చ్‌తో సర్వత్రా ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా రైతులు చేసిన పోరాటాన్ని తాజా మార్చ్ పిలుపు గుర్తు చేస్తున్నట్టు ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఇవీ డిమాండ్లు
రైతులు పండించే పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలని, దీనికి చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికులకు ఫించన్లు అందించాలని, లిఖింపూర్ బాధితులకు న్యాయం చేయాలని, రైతులపై కేసులను ఉపసంహరించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లతోనే రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్‌కు పిలుపునిచ్చారు. ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హర్యాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ధ పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను, బల్క్ ఎస్‌ఎంఎస్‌లను మంగళవారం దాకా నిషేదించింది. ఇకపోతే, రైతులు చేపట్టిన మార్చ్ నేపత్యంలో రైతు సంఘాలను కేంద్రం చర్చలకు ఆహ్వానించింది.
200కుపైగా రైతు సంఘాలు భాగస్వామ్యం
గతంలో మాదిరిగానే కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్న రైతులకు.. ఈసారి 200కుపైగా రైతు సంఘాలు మద్ధతు ఉంది. గతంలోనూ నెలలు తరబడి ఢిల్లీలో పోరాటాన్ని సాగించిన రైతులు మళ్లీ ఢిల్లీకి వస్తుండడం పట్ల కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఆందోళనకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రైతు సంఘాల ప్రతినిధులను చర్చలకు రావాలని కేంద్రం కోరింది. సంయుక్త కిసాన్ మోర్చ(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్ధూర్ మోర్చా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ సోమవారం చండీఘడ్ వెళ్లనున్నారు. ఈ మేరకు రైతుల నేత శర్వాన్ సింగ్ పంధేర్ ఈ వివరాలను వెల్లడించారు. మరోవైపు రైతులతో చర్చించాలని పంజాబ్ సీఎం మాన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్, ఇండియా మద్య సరిహద్దు నిర్మించొద్దని కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూడా గతంలో మాదిరిగా రైతుల ఆందోళనను జఠిలం చేసుకునేందుకు సిద్ధంగా లేదు. వీలైనంత వరకు రైతులతో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రులను చర్చలకు పంపిస్తోంది. ఈ చర్చలు విఫలమైతే యథావిధిగానే ఢిల్లీ మార్చ్ ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. సోమవారం కేంద్ర మంత్రులతో జరగనున్న చర్చలు ఢిల్లీ మార్చ్‌ను నిర్ధేశించనున్నాయి.