Garlic Price Steep Hike: ఏ కూర చేయాలన్నా.. ఏ వంటకం వండాలన్నా.. వెల్లుల్లి(Garlic) అవసరం కాదనలేనిది. ముఖ్యంగా మసాలా కూరలైతే.. వెల్లుల్లి వాడి తీరాల్సిందే. బిర్యానీలు, కుర్మాలు వంటివాటిలో వెల్లుల్లి పాత్ర తిరుగులేనిది. ఘుమఘుమలాడే వంటకాల్లో మిళితమైన వెల్లుల్లి కేవలం రుచులకే కాదు.. మన ఆరోగ్యానికి కూడా శ్రీరామ రక్ష అంటారు వైద్యులు. వెల్లుల్లో ఉండే విటమిన్లు.. ఇతర రసాయనాలు రక్త పోటు, మధుమేహం వంటివాటిని నియంత్రణలో ఉంచుతాయని వైద్యులు సైతం చెబుతున్నారు. ఇదెలా ఉన్నా... దేశవ్యాప్తంగా వెల్లుల్లి వాడకానికి ప్రత్యేకత ఉంది.
ఏ చిన్న ఫంక్షన్ జరిగినా.. వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ. ఆ బిర్యానీకి టేస్ట్ రావాలంటే.. మసాలా పడాల్సిందే. ఈ మసాలాకు రంగు, రుచి, వాసన తెచ్చేది వెల్లుల్లే. అలా మన వంటగదితో అవినాభావ సంబంధం పెనవేసుకున్న వెల్లుల్లి.. ఇప్పుడు కొనాలంటేనే మంటెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వీటి ధరలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం రమారమి.. కిలో రూ.400 నుంచి 450 వరకు వెల్లుల్లి ధరలు పలుకుతున్నాయి.
ప్రధాన మార్కెట్‌లోనే ధరలు భగ్గు
దేశం(Country)లోని అనేక నగరాల్లో వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, బీహార్(Bihar), రాజస్థాన్(Rajastan)లలో హోల్‌సేల్ ధర కిలోకు రూ.300-400 మధ్య పలుకుతోంది. ఉత్తరప్రదేశ్‌లో రూ.300-500 మధ్య ఉంది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లోని కృషి ఉపాజ్ మండిలో వెల్లుల్లి రైతులు క్వింటాల్‌కు 30,000 కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇక, మందసౌర్ జిల్లా సహా సమీప ప్రాంతాలలోని హోల్‌సేల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలోకు రూ.300-500 మధ్య ఉండగా, రిటైల్ మార్కెట్‌లో, కిలోకు రూ.1,000 వరకు విక్రయిస్తున్నారు.
కారణం ఇదీ..
వెల్లుల్లి ధరలు పెరగడానికి వర్షాభావం(Lack of Monsoon) లేదా అకాల వర్షాలే కారణమని తెలుస్తోంది. అక్టోబరు, నవంబరు నెలల్లో పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురవడంతో ఉత్పత్తి కుళ్లిపోయి.. తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని రైతులు చెబుతున్నారు. మందసౌర్ నుండి వెల్లుల్లి దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలకు ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానాకు సరఫరా అవుతున్నాయి. ఇక, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రైతులు వెల్లుల్లికి ధరలను పెంచారనే వాదన కూడా ఉంది. క్షేత్రస్థాయిలో వీరు ధరలు పెంచి విక్రయిస్తే.. మధ్య వ్యాపారులు, ట్రాన్స్ పోర్టు ఖర్చులు కలుపుకొంటే మరింతగా ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా..
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్(Raipur) హోల్‌సేల్(Hole sale) మార్కెట్(Market)లో వెల్లుల్లి కిలో రూ.288కి విక్రయిస్తున్నారు. రిటైల్ ధరలు 250 గ్రాములకు రూ.90-99కి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలొంది. వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాన్పూర్‌లోని చకర్‌పూర్ మండిలో కిలో రూ.300-400కి విక్రయిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని నవీన్ సబ్జీ మండిలో క్వింటాల్‌కు రూ.40,000 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి కిలో రూ.400-500కి విక్రయిస్తున్నారు. లక్నోలో కూడా కిలో రూ.400కి విక్రయిస్తుండగా, మీరట్‌లో కిలో రూ.400-480కి విక్రయిస్తున్నారు.
బిహార్‌లోనూ వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దర్భంగాలో కిలో వెల్లుల్లి ధర రూ.360 ఉండగా, ముజఫర్‌పూర్‌లో కిలో రూ.350కి చేరుకుంది. పాట్నాలో, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో, వెల్లుల్లి నాణ్యతను బట్టి కిలోకు రూ.200 నుండి రూ.400 వరకు ధర పలుకుతోంది. అస్సాంలో ఈ ధరలు మరింతగా పెరిగాయి. ఈశాన్య రాష్ట్రాలకు సాధారణంగా.. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో వాటి ప్రభావం మరింత పెరిగింది. దీంతో వెల్లుల్లి ధరలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా డిసెంబర్‌లో వెల్లుల్లి ధరలు పెరుగుతాయి, ఎందుకంటే నిల్వలు తగ్గుముఖం పట్టడమే. కానీ, ఈ సారి వర్షాభావం,అకాల వర్గాలతో వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే.. ఇవి తగ్గుముఖం పట్టాలంటే.. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చేవరకు వేచి ఉండక తప్పదు.
కిలో ధర ఎక్కడెలా?
హైదరాబాద్- రూ. 400
బెంగళూరు-రూ. 500
మందసౌర్ - రూ.300-500
రాయ్ పూర్ -రూ.288
కాన్పూర్ -రూ.300-400
ప్రయాగ్‌రాజ్ -రూ.400-500
లక్నో -రూ.400
మీరట్ -రూ.400-480
దర్భంగా -రూ.360
ముజఫర్‌పూర్ -రూ.350
పాట్నా -రూ.400
నాగపూర్ -రూ.300-400
జైపూర్ -రూ.280-300
ఉదయ్‌పూర్ -రూ.390
కోటా -రూ.400
జోధ్‌పూర్ -రూ.340-450