Congress Black Paper: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పదేళ్ల మోదీ సర్కార్ పాలనపై Black Paper విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం White Paper కి కౌంటర్‌గా దీన్ని రూపొందించారు. ఈ బ్లాక్ పేపర్‌లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ ప్రస్తావించినట్టు ఖర్గే వెల్లడించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలనూ ఎత్తి చూపినట్టు స్పష్టం చేశారు. దస్ సాల్ అన్యాయ్ కాల్ పేరిట ఈ బ్లాక్ పేపర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చిందని మండి పడ్డారు.
"మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు మల్లికార్జున్ ఖర్గే. రాష్ట్రపతి హోదాలో ఓ గిరిజన మహిళను కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ...ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మత కల్లోలాలు సృష్టించారంటూ ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? అని ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టారని మండి పడ్డారు.
"మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? దేశాన్ని ముక్కలు చేయాలంటూ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చారు. మీ ప్రసంగాలతో అల్లర్లు సృష్టించలేదా"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు