First Billionaire of India: ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ఎవరంటే ముఖేష్ అంబానీ అని చాలా మంది చెబుతారు. అయితే, మన దేశంలో మొదటి బిలియనీర్ ఎవరో మీకు తెలుసా?. టాటాలు, బిర్లాలు మాత్రం కాదు. ఆ రిచెస్ట్ పర్సన్‌కు సొంతంగా వజ్రాల గనులు, వేల కోట్ల విలువైన నగలు ఉన్నాయి. హుందాతనం, రాజరికం, విలాసవంతమైన జీవితానికి బ్రాండ్ అంబాసిడర్ అతను. అంతేకాదు, అతను హైదరాబాద్ వాసి.
ఆ సంపన్నుడెవరో ఇప్పటికైనా గెస్ చేశారా, లేదా గుర్తుకు రాలేదా?. అతని పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన హైదరాబాద్ నిజాం ప్రభువు.
హైదరాబాద్ నిజాంలు 1724-1948 వరకు, దాదాపు 224 సంవత్సరాలు పాలించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత, 1948 సెప్టెంబర్ 17న, హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. భారతదేశ చరిత్రలో ఈ నిజాంలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
భారతదేశపు తొలి బిలియనీర్ సంపద ఎంతంటే?
ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్కల ప్రకారం, భారతదేశపు మొదటి & అత్యంత సంపన్న బిలియనీర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం నవాబుల్లో ఆయనే చివరి వాడు. అత్యంత విలాసవంతమైన, భారీ ఖర్చులు చేయడంలో బాగా ఫేమస్ అయ్యాడు. హైదరాబాద్ చివరి నిజాం మొత్తం ఆస్తుల విలువ 230 బిలియన్ డాలర్లు.
ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో, తన 25వ ఏట హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిష్టించాడు. నిజాం పాలన నుంచి రాష్ట్రానికి స్వేచ్ఛ దొరికే వరకు హైదరాబాద్‌ను పాలించాడు. నిజాంకు అతి పెద్ద ఆదాయ వనరు గోల్కొండ గనులు. ఆ గనుల్లో దొరికిన వజ్రాలు నిజాం ఖజానాలో చేరేవి.
చివరి నిజాం సింహాసనాన్ని అధిష్టించిన మూడేళ్ల తర్వాత, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఔట్‌లుక్ రిపోర్ట్‌లో ప్రకారం, నిజాం నవాబు బ్రిటిష్ వాళ్లకు యుద్ధంలో సైనికంగా, ఆర్థికంగా సాయం చేసాడు. 1917లో, హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.
సొంత కరెన్సీ, 50 రోల్స్ రాయిస్ కార్లు
నిజాం నవాబు సాధారణ దుస్తులు ధరించడు, సాధారణ కార్యక్రమాలకు అసలు హాజరు కాడు. తన సంస్థానంలో సొంత కరెన్సీని చెలామణీ చేశాడు. అతనికి 100 మిలియన్ పౌండ్ల బంగారం, 400 మిలియన్ పౌండ్ల నగలు, సొంత విమానయాన సంస్థ ఉందని డీఎన్‌ఏ రిపోర్ట్ చేసింది. క్వీన్ ఎలిజబెత్ IIకి 300 వజ్రాలతో కూడిన డైమండ్ నెక్లెస్ సెట్‌ను పెళ్లి కానుకగా ఇచ్చాడు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1,000 కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడని చెబుతారు. అతని వద్ద 50 రోల్స్ రాయిస్ కార్లు ఉండేవి. 1940ల ప్రారంభంలో, నిజాం మొత్తం ఆస్తులు సుమారు రూ. 1700 కోట్లుగా అంచనా వేశారు. DNA రిపోర్ట్ ప్రకారం, 2023 నాటికి ఆ ఆస్తులు విలువ దాదాపు రూ. 2,95,770 కోట్లుగా లెక్కేశారు.
మరో ఆసక్తికర కథనం: వంటింటి మంట నుంచి ఉపశమనం, ఆయిల్ రేట్లు భారీగా తగ్గాయి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial