Rice Price Hike: గత కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా బియ్యం రేటు విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం ఎక్కువగా ఆసియా మార్కెట్‌పై కనిపిస్తోంది. ఆసియాలో, రైస్‌ రేట్లు దాదాపు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం, థాయ్‌లాండ్‌లో కరవు కారణంగా బియ్యం ధరలు మండిపోతున్నాయి.


5 శాతం విరిగిన థాయ్ బియ్యాన్ని ఏసియన్‌ బెంచ్‌మార్క్‌గా భావిస్తారు. థాయ్ రైస్ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ సంఘం డేటా ప్రకారం, 2008 అక్టోబర్‌ నుంచి ఈ బియ్యం రేటు పెరుగుతూనే ఉంది, ప్రస్తుతం టన్నుకు 648 డాలర్ల వద్దకు చేరుకుంది. కేవలం గత ఏడాది వ్యవధిలోనే అక్కడ బియ్యం ధర 50 శాతం పెరిగింది. 


ఆసియాతో పాటు ఆఫ్రికాపైనా ఎఫెక్ట్‌
ఆసియన్లతో పాటు ఆఫ్రికా ప్రజల ప్రధాన ఆహారంలో బియ్యం ఒకటి. ఇది, ఈ రెండు ఖండాల్లోని వందల కోట్ల మంది ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు, పెరుగుతున్న రైస్‌ రేట్లు నేరుగా అనేక దేశాలను అల్లాడిస్తున్నాయి, దిగుమతి బిల్లులను విపరీతంగా పెంచుతున్నాయి. 


బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, ఎల్ నినో ప్రభావంతో (El Niño effect) ఈ సంవత్సరం థాయ్‌లాండ్‌లో 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వానలు లేక, ఆ దేశంలో వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించాలని, ఏడాదికి ఒక్క పంటే వేయాలని థాయ్‌ ప్రభుత్వం అక్కడి రైతులకు సూచించింది. దీనివల్ల, ఈ ఏడాదితో పాటు మరికొన్ని సంవత్సరాల పాటు థాయ్‌లాండ్‌లో వరి పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది, దిగుబడిపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుంది. 


బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని నిషేధించిన భారత్
మన దేశం నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయకుండా ఈ ఏడాది జులై 20న భారత ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్‌ బ్యాన్‌ (Ban on Rice Export) విధించింది. అది తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇండియాలో పెరుగుతున్న రైస్‌ రేట్లకు కళ్లెం వేయడానికి, లోకల్‌గా సప్లై పెంచడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఈ డెసిషన్‌ తీసుకుంది. అయితే, బాయిల్డ్‌ రైస్‌, బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు.


ప్రపంచ మార్కెట్‌లోకి బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో తొలి స్థానం మనదే. భారత్‌ వివిధ రకాల బియ్యాల్ని సరిహద్దులు దాటిస్తోంది. మొత్తం గ్లోబల్‌ బిజినెస్‌లో 40% వాటా ఇండియాదే. భారత్‌ బ్యాన్‌ చేసిన బియ్యం రకాల వాటా 15%. ఆగ్నేయాసియాలోని ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా, ఐవరీ కోస్ట్, సెనెగల్‌ భారతదేశ బియ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. భారతదేశం బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన తర్వాత, ప్రపంచ సరఫరా గొలుసును తీవ్రంగా ప్రభావితం అయింది. 


ప్రపంచ మార్కెట్‌లోకి బియ్యం ఎగుమతుల్లో థాయిలాండ్‌ రెండో స్థానంలో ఉంది. అక్కడ తక్కువ ఉత్పత్తి వల్ల పరిస్థితిని మరింత దిగజారింది, ప్రపంచ మార్కెట్‌లోకి బియ్యం సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. సప్లై తగ్గడంతో, ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో బియ్యం రేట్లు అమాంతం పెరిగాయి.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నల్ల సముద్రం ప్రాంతం నుంచి గోధుమలు సహా మరికొన్ని రకాల ధాన్యం రావాణా తగ్గింది. ప్రపంచ ఆహార మార్కెట్‌లో ధరలపై ఒత్తిడి పెంచిన కారణాల్లో ఇది కూడా ఒకటి.


మరో ఆసక్తికర కథనం: షాపులకు వెళ్లట్లా, అంతా ఆన్‌లైన్‌ షాపింగే - ఎక్కువగా ఆర్డర్‌ చేస్తోంది వీటినే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial