బాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. గత ఏడాది 'RRR' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సీత పాత్రలో ఎంతో బాగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఆలియా భట్ హాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే హాలీవుడ్ మూవీ లో గాల్ గాడోట్ , జామీ డోర్నన్ వంటి హాలీవుడ్ నటీనటులతో కలిసి నటిస్తోంది. ఆగస్టు 11న నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ విడుదలవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది ఆలియా భట్. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అలియా భట్ తన గురించి గూగుల్ లో ఎక్కువగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
అందులో.. ‘‘ఆలియా భట్ బ్రిటిష్ దేశానికి చెందిందా?’’ అనే ప్రశ్న కూడా ఉంది. దీంతో ఈ ప్రశ్నకు ఆలియా భట్ సమాధానం ఇస్తూ.. తన అమ్మ బర్మింగ్ హమ్ లో జన్మించారని, కానీ తాను భారతదేశంలో పుట్టి పెరిగానని చెప్పింది. అయితే, తనకు బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందని వెల్లడించింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్ తల్లి సోనీ రజ్‌ధన్ తాను యూకే లో జన్మించినప్పటికీ, ఇండియాలోనే పెరిగాను అని తెలిపారు. ‘‘నేను UKలో పుట్టాను. కానీ నాకు మూడు నెలల వయసు ఉన్నప్పుడు ముంబైకి మారాం. మా అమ్మ నాకోసం బ్రిటిష్ పాస్ పోర్టును కూడా తీసున్నారు. మేము దక్షిణ ముంబైలో నివసించాం. అలాగే నేను చదువుకుంది కూడా బాంబే ఇంటర్నేషనల్ స్కూల్లోనే" అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా.. "మా అమ్మగారు జర్మనీ ఫ్యామిలీకి చెందినవారు. హిట్లర్ అధికారంలోకి రాకముందు వాళ్ళు తూర్పు బెర్లిన్ లో నివసించారు. మా తాత కార్ల్ హోజ్లర్ అప్పట్లో హిట్లర్ కు వ్యతిరేకంగా ఓ వార్తాపత్రిక నడిపారు. అప్పుడు మా తాతని ఖైదు చేసి నిర్బంధించారు. మా తాత వైపు మంచి లాయర్ ఉండడంతో ఆయన సహకారంతో విడుదలయ్యారు. కానీ ఆయన్ని జర్మనీ విడిచి వెళ్ళమని చెప్పారు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దాంతో కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయాడు" అని తెలిపారు అలియా భట్ తల్లి. ఆలియా భట్ విషయానికి వస్తే.. గత ఏడాది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఏప్రిల్ 14, 2022న ముంబైలో పెళ్లి చేసుకోగా.. వీరిద్దరికీ నవంబర్ నెలలో ఓ ఆడపిల్ల జన్మించింది. ఆమెకి 'రాహ' అని నామకరణం చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో ఆలియా భట్ నెగిటివ్ రోల్ లో నటించింది. ఇందులో ఆలియా భట్ కీయా అనే పాత్ర పోషించింది.
Also Read : సమంత పేరు మీద ఇడ్లీ స్టాల్ పెట్టాలని ప్లాన్ చేశాం, కానీ..: విజయ్ దేవరకొండ