2000 Rupees Note Returned in Banks: రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ విత్‌డ్రా చేసిన తర్వాత, ప్రజల వద్ద ఉన్న పింక్‌ నోట్ల క్రమంగా తిరిగి బ్యాంకుల వద్దకు వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన తాజా అప్‌డేట్‌ ప్రకారం... చలామణీలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చాయి. ఈ లెక్కన ఇప్పుడు మార్కెట్‌లో 7 శాతం నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


ఈ ఏడాది మే 19వ తేదీన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ. 2000 నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా (Last date to deposit/ Exchange 2000 rupees notes) బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమో లేదా చిన్న నోట్లుగా మార్చుకోవడమో చేయాలని సూచించింది. ఆ గడువు వరకు రూ. 2000 నోట్లు చెలామణిలోనే ఉంటాయని తెలిపింది. 


ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.2000 నోట్ల విలువ ఇది
రిజర్వ్ బ్యాంక్ షేర్‌ చేసిన డేటా ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు. అదే తేదీ నాటికి, మార్కెట్‌లో రూ. 0.24 లక్షల కోట్ల విలువైన (7 శాతం) రూ. 2,000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.


బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చిన రూ. 2000 నోట్లలో (రూ. 3.32 లక్షల కోట్లలో) దాదాపు 87 శాతం నోట్లు కరెంట్‌/సేవింగ్స్‌/రికరింగ్‌/ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన 13 శాతం పింక్‌ నోట్లను ఇతర చిన్న డినామినేషన్ల రూపంలోకి ప్రజలు మార్చుకున్నారు. 


ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి, మన దేశంలో రూ. 3.7 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. చలామణీలో ఉన్న మొత్తం (ఇతర నోట్లతో కలిపి) కరెన్సీలో రూ. 2 వేల నోట్ల వాటా 10.8%. ఆర్‌బీఐ ఉపసంహరణ ప్రకటన వచ్చిన మే 19వ తేదీ నాటికి వాటి విలువ రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. 


ఈ నెలాఖరే డెడ్‌లైన్‌
రెండు వేల రూపాయల నోట్లను ఇతర నోట్లతో మార్చుకోవడం లేదా ఖాతాలో డిపాజిట్‌ చేయడానికి ఈ నెలాఖరు (సెప్టెంబరు 30, 2023‌) వరకు అవకాశం ఉంది. ఈ నెలతో గడువు ముగియనున్న నేపథ్యంలో, ఇంకా రూ. 2,000 నోట్లను దగ్గర పెట్టుకున్న వాళ్లు వెంటనే వాటిని మార్చుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించింది.


సెప్టెంబర్‌ 30 తర్వాత పింక్‌ నోట్లు చెల్లవా?
సెప్టెంబరు 30 వరకు 2,000 డినామినేషన్ నోట్లు లీగర్‌ టెండర్‌గా (చట్టబద్ధమైన కరెన్సీగా)‌ కొనసాగుతుంది. సెప్టెంబరు 30 గడువు తర్వాత ఆ నోట్లను రద్దు చేయాలమని తాను ప్రభుత్వాన్ని కోరతానో, లేదో తనకు ఖచ్చితంగా తెలియదని, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చికి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవిత కాలం నాలుగు-ఐదు సంవత్సరాలు. ఆ గడువు ఇప్పుడు ముగింపులో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్‌ ప్రెస్‌లు 2018-19లోనే 2,000 నోట్ల ముద్రణ బంద్‌ చేశాయి.


మరో ఆసక్తికర కథనం: ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్న 5 బైబ్యాక్‌ ఆఫర్‌లు, వీటిలో ఏ కంపెనీ షేర్లు మీ దగ్గర ఉన్నాయి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial