Reliance Jio 7 Years Of Anniversary: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఓనర్‌ & భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ.. టెలికాం పరిశ్రమలో గేమ్ ఛేంజర్ అయిన రిలయన్స్ జియోను సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2016 సెప్టెంబర్‌ 5న ప్రారంభించారు. దేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు జియో వెన్నెముకగా మారుతుందని ఆ రోజున ఎవరూ ఊహించలేదు. ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న జియో, ఈ ఏడేళ్ల కాలంలో దేశంలో చాలా మార్పులు తెచ్చింది.


ఏడు సంవత్సరాల్లో జియో తెచ్చిన ఏడు ప్రభావాలు: 


1. ఉచిత ఔట్‌ గోయింగ్ కాల్స్‌
2016 సెప్టెంబర్ 5న, ప్రారంభించిన మొదటి రోజునే, దేశంలో ఖరీదైన ఔట్‌ గోయింగ్ కాలింగ్ కథకు రిలయన్స్‌ జియో ముగింపు పలికింది. మన దేశంలో ఔట్‌ గోయింగ్ కాల్స్‌ను ఉచితంగా చేసిన మొదటి కంపెనీగా జియో అవతరించింది. ఇది నేటికీ కొనసాగుతోంది.


2. భారీగా తగ్గిన డేటా, మొబైల్ బిల్లుల మోత
మొబైల్ డేటా రేట్ల మీద మరో భారీ ప్రభావం చూపింది. జియో రాకముందు, ఒక GB డేటా కోసం దాదాపు 255 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. జియో, డేటా ధరలను చాలా దూకుడుగా తగ్గించింది & డేటా GBని 10 రూపాయల కంటే తక్కువకే అందుబాటులోకి తెచ్చింది.


ఉచిత కాలింగ్, తగ్గిన డేటా రేట్ల తర్వాత మొబైల్ బిల్లుల మోత భారీగా తగ్గింది. డేటా వినియోగంలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జియో రాకముందు భారత్ 155వ స్థానంలో ఉండేది. ఇప్పుడు జియో నెట్‌వర్క్‌లో ప్రతి నెలా 1,100 కోట్ల GB డేటాను ప్రజలు వాడుకుంటున్నారు. జియో కస్టమర్ నెలకు సగటున 25 GB డేటాను ఉపయోగిస్తున్నాడు. పరిశ్రమలోనే ఇది అత్యధికం.


3. చిన్న మొబైల్ స్క్రీన్‌లోకి మొత్తం స్టోర్‌
జియో కారణంగా డేటా చౌకగా మారింది, ప్రపంచం మొత్తం మొబైల్‌లోకి వచ్చింది. ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కేవలం ఒక క్లిక్‌తో అందుబాటులోకి వస్తోంది. రైలు, విమానం, సినిమా అయినా అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. హోటల్ బుకింగ్స్‌, ఫుడ్ సైట్‌లు, యాప్స్‌లో బూమ్ వచ్చింది. పర్యాటకం పుంజుకుంది. ఈ-కామర్స్ కంపెనీలు తమ మొత్తం స్టోర్‌ను మొబైల్‌లోకి తెచ్చాయి. కరోనా కాలంలో తరగతి పాఠాలు, ఆఫీస్ వర్క్‌ ఆన్‌లైన్‌లోకి మారింది. తక్కువ రేట్లకు డేటా అందుబాటులో ఉండడమే దీనికి కారణం. జియో రాకుండా, ఒక జీబీ ధర రూ.255గానే ఉంటే, కరోనా కాలంలో ఏం జరిగి ఉండేదో ఊహించండి.


4. డిజిటల్ చెల్లింపులు
భారత ప్రభుత్వం లాంచ్‌ చేసిన UPI ఓపెన్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అన్నింటినీ మార్చేసింది. పేటీఎం, ఫోన్‌పే వంటి వాలెట్ కంపెనీలు సహా పెద్ద & చిన్న బ్యాంకులు, ఆర్థిక దిగ్గజాలు ఈ ఇనీషియేటివ్‌లో జాయిన్‌ అయ్యాయి. డబ్బు చెల్లింపు వ్యవస్థ మొత్తం మొబైల్స్‌ ద్వారా జరపడమే లక్ష్యం. ఈరోజు, వీధి వ్యాపారుల మొదలు 7 నక్షత్రాల హోటళ్ల వరకు అంతా UPIని యాక్సెప్ట్‌ చేస్తున్నారు. జియో సహా అన్ని టెలికాం కంపెనీల డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఉపయోగపడింది. కానీ UPI విజయంలో కీలక పాత్ర మాత్రం తక్కువ డేటా ధరలదే అవుతుంది. 


5. 2G నుండి 5G వరకు
లాంచ్ అయిన మరుసటి సంవత్సరంలోనే, అంటే 2017లో కంపెనీ జియోఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2G కస్టమర్లను 5Gకి మార్చడమే ప్రస్తుతం జియో లక్ష్యం. తద్వారా వారంతా డిజిటల్ ఎకానమీలో భాగం అవుతారు. ఇప్పటివరకు 13 కోట్లకు పైగా జియోఫోన్ మొబైల్స్ అమ్ముడుపోయాయి. ఏ దేశంలోనైనా ఒక మొబైల్‌ ఫోన్‌ మోడల్ సృష్టించిన రికార్డ్‌ ఇది. 


6. డిజిటల్ అంతరాలు తగ్గింపు
ఇంతకుముందు, డబ్బున్న వాళ్లు మాత్రమే డేటాను ఉపయోగించుకునేవారు, దీనికి కారణం డేటా రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండడం. డిజిటల్‌ వినియోగంలో ధనిక-పేద అంతరాన్ని జియో రూపుమాపింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు డేటాను సులభంగా ఉపయోగించుకుంటున్నారు. 4G సిగ్నల్స్‌ నగరాలను దాటి గ్రామాలకు చేరాయి. నగర ప్రజల మాదిరిగానే గ్రామీణులు కూడా ప్రతి డిజిటల్ సౌకర్యాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. జన్‌ ధన్‌ ఖాతాలను నిర్వహించడం, ప్రభుత్వ పథకాల్లో నమోదు చేసుకోవడం, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయడం వంటి అన్ని రకాల డిజిటల్ పనులను ఇప్పుడు గ్రామంలోనే కూర్చుని సులభంగా చేయవచ్చు.


7. యునికార్న్ వరద
$1 బిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌ను యునికార్న్‌ అంటారు. జియో రాకముందు దేశంలో నాలుగైదు యునికార్న్‌లు మాత్రమే ఉండేవి, ఇప్పుడు 108కి పెరిగాయి. వీటిలో ఎక్కువ భాగం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ మార్పునకు వెన్నెముక రిలయన్స్ జియో. ఈరోజు, భారతీయ యునికార్న్‌ల మొత్తం విలువ రూ.28 లక్షల కోట్ల కంటే ఎక్కువ. జొమాటో ఫౌండర్‌ దీపేంద్ర గోయల్, నెట్‌ఫ్లిక్స్ CEO రీడ్ హేస్టింగ్స్ సహా చాలామంది ప్రముఖులు భారతదేశంలో వృద్ధికి జియో అందించిన సహకారాన్ని ఓపెన్‌గా మెచ్చుకున్నారుక. ఇండియన్‌ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ త్వరలో 1 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకుతుందని భారతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


అంతేకాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (AI) త్వరలో భారతీయులందరికీ చేరువ చేస్తానని ముఖేష్ అంబానీ ఇటీవల హామీ ఇచ్చారు. డేటా తరహాలోనే ప్రతి భారతీయుడికి కృత్రిమ మేధస్సు హక్కు ఉందని అంబానీ చెప్పారు. ఈ సాంకేతికత ఏ రేంజ్‌లో ప్రభావం చూపుతుందో ఇప్పటికే ప్రపంచానికి అర్ధమైంది. 5G వేగంతో పని చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాన్య భారతీయుడి భవిష్యత్‌ చిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.


మరో ఆసక్తిరక కథనం: 75 పైసలకు కక్కుర్తి పడి లక్ష రూపాయలు వదిలించుకున్న ITC, ఇది 'ఒక బిస్కట్‌' కథ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial