Viral News: ఒక్క బిస్కట్‌ ఖరీదు లక్ష రూపాయలు. బహుశా, ITC లిమిటెడ్ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదేనమో. ఆ బిస్కట్‌ అరుదైన ముడిపదార్థాలతో, అత్యంత నాణ్యతతో తయారైందేమీ కాదు. అంబానీ కోసమో, అదానీ కోసమో ప్రత్యేకంగా ఉత్పత్తి చేయలేదు. అదొక సాదాసీదా బిస్కట్‌. సాధారణ ప్రజల కోసం అతి సామాన్యంగా దానిని ఉత్పత్తి చేశారు. అయినా, ఆ బిస్కట్‌ కోసం ఐటీసీ లక్ష రూపాయలు ఖర్చు చేసింది.


ఐటీసీ బిస్కట్‌ ఉత్పత్తులో... 16 బిస్కెట్లు ఉండే "సన్ ఫీస్ట్ మేరీ లైట్" ‍‌(Sun Feast Marie Light) ప్యాక్‌ ఒకటి. ఈ ప్యాక్‌లో 16 బిస్కట్లు ఉంటాయి. ఒక్కో బిస్కట్‌ రేటు 75 పైసలు. ఈ బిస్కట్‌ చుట్టూనే కథ తిరిగింది.


ఇది 'ఒక బిస్కట్‌' కథ
చెన్నైలోని MMDA మాథుర్‌కు చెందిన పి.డిల్లీబాబు, 2021 డిసెంబర్‌లో, వీధి కుక్కులకు ఆహారంగా వేయడానికి మనాలీలోని రిటైల్ స్టోర్ నుంచి రెండు డజన్ల "సన్ ఫీస్ట్ మేరీ లైట్" బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఆ ప్యాకెట్‌లో 16 బిస్కట్లు ఉంటాయని రేపర్‌ మీద ఉన్నప్పటికీ, ప్యాకెట్లను తెరిచి చూస్తే 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. దీని మీద దిల్లీబాబు ఆ స్టోర్‌ను, ఐటీసీని సంప్రదించినా సరైన స్పందన రాలేదు. 


దీంతో, దిల్లీబాబుకు కాలింది. కన్స్యూమర్ ఫోరంలో కేసు వేశాడు. సన్ ఫీస్ట్ మేరీ లైట్ ప్యాకెట్‌లో ఉన్న ఒక్కో బిస్కెట్ ఖరీదు 75 పైసలు అని, ఐటీసీ లిమిటెడ్ రోజుకు దాదాపు 50 లక్షల ప్యాకెట్లను తయారు చేస్తుందని ఫిర్యాదులో వివరించాడు. ప్రతి ప్యాకెట్‌లో ఒక బిస్కట్‌ను తక్కువ చేయడం ద్వారా ఐటీసీ కంపెనీ ప్రతిరోజు 29 లక్షల రూపాయలకు పైగా మోసానికి పాల్పడుతోందని వాదించాడు.


నంబర్‌లోనే కాదు, బరువులోనూ మోసం
దీనిపై కంపెనీ సమాధానం ప్రతిస్పందించింది. బరువు ఆధారంగా మాత్రమే బిస్కట్లను విక్రయిస్తామని, సంఖ్య ఆధారంగా కాదని వాదించింది. బిస్కెట్ ప్యాకెట్ నికర బరువు 76 గ్రాములు అని వెల్లడించింది. అయితే కమీషన్ పరిశీలించగా.. 15 బిస్కెట్లు ఉన్న ప్యాకెట్లన్నీ 74 గ్రాముల బరువు మాత్రమేనని తేలింది.


దీనిపైనా కంపెనీ వాదనలు వినిపించింది. 2011 లీగల్ మెట్రాలజీ రూల్స్ ప్రకారం, ప్రి-ప్యాకేజ్డ్ కమోడిటీస్ గరిష్టంగా 4.5 గ్రాముల వరకు తక్కువ బరువు ఉండొచ్చని ఐటీసీ లాయర్‌ వాదించారు. కమీషన్‌ దానికి అంగీకరించలేదు. అస్థిరమైన ఉత్పత్తులకు మాత్రమే ఆ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాలం గడిచినా బరువు తగ్గని బిస్కెట్ల వంటి వస్తువులకు అది వర్తించదని చెప్పింది. 


అటు "సంఖ్య" పరంగాను, ఇటు "బరువు" పరంగాను ఐటీసీ మోసం రుజువైంది. అన్యాయమైన వ్యాపార విధానాలను అవలంబించినందుకు గాను, దిల్లీబాబుకు నష్టపరిహారంగా లక్ష రూపాయలు చెల్లించాలని వినియోగదారుల కమీషన్‌ తీర్పు చెప్పింది. నిర్దిష్ట పరిమాణంలో లేని ఆ బిస్కెట్‌ ప్యాకెట్ల అమ్మకాలను వెంటనే ఆపేయాలని గత నెల 29న ఐటీసీని ఆదేశించింది. ఇదీ లక్ష రూపాయల సాదాసీదా బిస్కట్‌ కథ.


మరో ఆసక్తికర కథనం: చక్కెర కొరత, లాభాల మోత - తియ్యటి వేడుక చేసుకుంటున్న ఇన్వెస్టర్లు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial