Reliance Retail: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ ఆర్మ్‌ 'రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌'లోకి (RRVL) గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల నుంచి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా, 'అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ' (ADIA), రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌ లిమిటెడ్‌లోకి ఎంట్రీ తీసుకుంది. ఇందుకోసం, RRVLలో 4,966.80 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. ఈ డీల్‌తో ADIAకి RRVLలో 0.59 శాతం ఈక్విటీ షేర్‌ దక్కుతుంది.


నాలుగు పెద్ద కంపెనీల్లో ఒకటిగా మారిన RRVL
అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ పెట్టుబడి కోసం రిలయన్స్‌ రిటైల్‌ ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూని రూ. 8.381 లక్షల కోట్లుగా (100.83 బిలియన్‌ డాలర్లు) లెక్కించారు. దీంతో, ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీల్లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఆవిర్భవించిందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన బిజినెస్‌ అప్‌డేట్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) వెల్లడించింది.


ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న రిలయన్స్ రిటైల్‌కు ఇషా అంబానీ (Isha Mukesh Ambani) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని అతి వేగంగా వృద్ధి చేసింది. సొంతంగా ఎదగడంతో పాటు (ఆర్గానిక్‌ రూట్‌), వేరే కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా (ఇన్‌-ఆర్గానిక్‌ రూట్) విస్తరించింది. విలీనాలు, కొనుగోళ్ల మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది, తద్వారా వందలాది బ్రాండ్స్‌ను రిలయన్స్‌ గొడుగు కిందకు చేర్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యంత లాభదాసాటి వ్యాపారాల్లో రిలయన్స్‌ రిటైల్ ఒకటి.


రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌ లిమిటెడ్‌కు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 18,500 పైగా స్టోర్లు ఉన్నాయి. డిజిటల్ కమర్షియల్ ప్లాట్‌ఫామ్ రిజిస్టర్డ్ నెట్‌వర్క్‌ ద్వారా 26.7 కోట్ల మంది వినియోగదార్లకు సేవలు అందిస్తోంది. RRVL, తన న్యూ కామర్స్ వ్యాపారం ద్వారా 30 లక్షలకు పైగా చిన్న & అసంఘటిత వ్యాపారులను డిజిటల్ ప్రపంచంతో అనుసంధానించింది. తద్వారా ఈ వ్యాపారులు తమ వినియోగదార్లకు మరింత చేరువవుతారు, మంచి ధరలకు ఉత్పత్తులను అందించగలుగుతారు.


రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ADIA పెట్టుబడి పెట్టడం, ఆ సంస్థ నిరంతర మద్దతు తమ రెండు కంపెనీల సంబంధాన్ని మరింతగా బలోపేతం చేసిందని ఇషా అంబానీ అన్నారు. ఈ బంధం, ప్రపంచ స్థాయిలో దీర్ఘకాలంలో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. భారతీయ రిటైల్ రంగంలో మార్పులు వేగవంతమవుతాయని చెప్పారు. RRVLలో ADIA పెట్టుబడి... భారతీయ ఆర్థిక వ్యవస్థ, రిలయన్స్‌ వ్యాపారం, వ్యూహాలు, సామర్థ్యంపై వారి విశ్వాసానికి నిదర్శనం అని అన్నారు.


రిలయన్స్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం కొనసాగిస్తున్నందుకు, ఇండియన్‌ కన్జ్యూమర్‌ సెక్టార్‌లో పెట్టుబడులు పెడుతున్నందుకు తమకు సంతోషంగా ఉందని ఏడీఐఏ ప్రైవేట్ ఈక్విటీ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హమద్‌ షాహ్వాన్‌ అల్దహేరి చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో రిలయన్స్ రిటైల్ బలమైన పనితీరు కనబరుస్తోందన్నారు. ఈ పెట్టుబడిలో రిటైల్‌ రంగంలో ప్రత్యేక మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 


రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌ - అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ మధ్య డీల్‌ కోసం మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial