FMCG brand Independence:


భారతీయ ఎఫ్‌ఎంసీజీ విపణిలోకి రిలయన్స్‌ రిటైల్‌ తమ సరికొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 'ఇండిపెండెన్స్‌' బ్రాండ్‌ పేరుతో గుజరాత్‌లో వినియోగ వస్తువుల అమ్మకాలు మొదలు పెట్టనుంది. మేడిన్‌ ఇండియా కన్జూమర్‌ ప్యాకేజ్‌ వస్తువులను విక్రయించబోతున్నామని వెల్లడించింది. ఉప్పు దగ్గర్నుంచి ప్రాసెస్‌ చేసిన ఆహారం వరకు అన్నింటినీ విక్రయించబోతోంది. నిత్యావసర సరుకులను తక్కువ ధర, అత్యంత నాణ్యతతో అందిస్తామని ప్రకటించింది.


వినియోగదారుల్లో తమ బ్రాండ్‌ పట్ల నమ్మకం పెంచేందుకు రిలయన్స్‌ రిటైల్‌ ప్రయత్నిస్తోంది. 'ఇండిపెండెన్స్‌'ను విస్తరించేందుకు గుజరాత్‌ను తొలుత ఎంచుకుంది. ఎఫ్‌ఎంసీజీ రిటైలర్లను నియమించుకోనుంది. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా 'ఇండిపెండెన్స్‌' బ్రాండ్‌తో ఆహార పదార్థాలు, నిత్యావసర సరకులు విక్రయిస్తామని వెల్లడించింది.


'మా సరికొత్త ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌ ఇండిపెండెన్స్‌ను ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వంట నూనెలు, తిండి గింజలు, పప్పు ధాన్యాలు, ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు, ప్రతిరోజూ ఉపయోగించే నిత్యావసర సరుకులను అత్యంత నాణ్యతతో అందుబాటు ధరలకే అందిస్తాం. భారతీయ సమస్యలకు స్వదేశీ పరిష్కారంగా ఈ బ్రాండ్‌ నిలుస్తుంది. కణ్‌ కణ్‌ మే భారత్‌ నినాదంతో మేం ముందుకెళ్తాం. భావోద్వేగ అనుబంధం నెలకొల్పుతాం. భారతీయుల సమ్మిళత్వాన్ని ప్రతిబింబిస్తాం' అని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


అత్యంత వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువల మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందుస్థాన్‌ యునీలివర్‌, ఐటీసీ వంటి సంస్థలకు నేరుగా పోటీనిస్తామని 45వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. కాగా కొన్ని కంపెనీల బ్రాండ్లను సొంతం చేసుకొనేందుకు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ గట్టిగా ప్రయత్నిస్తోందని సమాచారం. కెవిన్‌కేర్‌ నుంచి నమ్‌కీన్స్‌, లహోరీ జీరా, బిందు బేవరేజెస్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటోందని తెలిసింది.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సబ్సిడరీ కంపెనీ. అన్ని రిటైల్‌ బిజినెస్‌లు దీని ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. 2022, మార్చి 31 నాటికి కన్సాలిడేటెట్‌ ప్రాతిపదికన రూ.1.99 లక్షల కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. రూ.7,055 కోట్ల నికర లాభం ఆర్జించింది. చివరి త్రైమాసికంలో రూ.64,920 కోట్ల స్థూల రాబడి నమోదు చేసింది. 2023 ఆర్థిక ఏడాది ప్రథమార్ధంలో ఈ డివిజన్‌ గతేడాది నిర్వాహక ఆదాయంలో 75 శాతం నమోదు చేసింది.


Also Read: బాబోయ్‌ ఫెడ్‌! మార్కెట్లో హరాకిరీ - రూ.4 లక్షల కోట్లు ఆవిరి


Also Read: ఈ ఏడాది ఎక్కువ రిటర్న్‌ ఆఫర్‌ చేసిన లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే!