RBI to withdraw Rs 2000 currency note: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తన నిర్ణయం ప్రకటించింది. అయితే రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు మార్చుకునేందుకు ఆర్బీఐ వెసలుబాటు కల్పించింది. రూ. 2000 నోటు చెలామణి కాకుండా ఉపసంహరించుకుంది. ఇకనుంచి రూ.2 వేల నోట్లను జారీ చేయకూడదని, వినియోగదారులకు ఇవ్వకూడదని బ్యాంకులకు సూచిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది.
2018 లోనే రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అదే సమయం నుంచి గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు రెండు వేల నోట్లను సైతం రద్దు చేస్తారని పలుమార్తు ప్రచారం జరిగింది. ప్రజలు అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నోట్లు చెలామణిలో ఉండవని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. ఒకేసారి 20 వేల రూపాయల వరకు మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులపై ఏ ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. కేవలం రూ.2 వేల నోట్లతో లావాదేవీలు జరిపే వారు, రియల్ ఎస్టేట్, పెద్ద వ్యాపారం నిర్వహించే వారికి ఈ నిర్ణయంతో కాస్త ఇబ్బంది ఉంటుందన్నారు.
మే 23న నోట్ల మార్పిడి ప్రారంభం..
మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు రెండు వేల నోట్లను ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చు, డిపాజిట్ సైతం చేసుకునే వీలు కల్పించింది ఆర్బీఐ. క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచీలలో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కొరతతో ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 24(1) ప్రకారం దేశంలో రూ.2000 నోట్లను 2016లో నవంబర్ లో ప్రవేశపెట్టారు. రెండేళ్ల అనంతరం ఈ పెద్ద నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. 2017 మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదులో 2 వేల నోట్ల వాటా 89 శాతానికి చేరింది. 2018 మార్చి 31 నాటికి ఈ నోట్ల విలువ రూ.6.72 లక్షలుగా ఉంది. అయితే 2023 మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది.
గతంలో 2013-14లో ఇదే తరహాలో చలామణిలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నట్లు కీలక ప్రకటనలో ఆర్బీఐ గుర్తుచేసింది. బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసులలో రెండు వేల నోట్లను మార్చుకునే ప్రక్రియ మే 23న ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 30న ముగియనుందని ఆర్బీఐ తెలిపింది. మరిన్ని వివరాలకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో అప్ డేట్స్ చెక్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది.