ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక ట్విట్టర్ వింత పోకడలకు వేదికగా మారింది. సిబ్బందిని తొలగించడం దగ్గర నుంచి, వెరిఫికేషన్‌కు డబ్బులు వసూలు చేయడం వరకు ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పుడు తాజాగా ట్విట్టర్‌లో మరో ఫీచర్‌ను కూడా తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. ఇప్పుడు ట్విట్టర్‌లో రెండు గంటల వరకు నిడివి ఉన్న వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చు. దీనిపై నెటిజన్ల నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ట్విట్టర్ ఇకపై పైరసీకి అడ్డాగా మారుతుందని, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు యూట్యూబ్‌కు పోటీగా తయారవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


రెండు నిమిషాల నుంచి రెండు గంటల వరకు
ఎలాన్ మస్క్ టేకోవర్ చేయకముందు ట్విట్టర్‌లో కేవలం రెండు నిమిషాల 20 సెకన్ల నిడివి వరకు మాత్రమే వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉండేది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ వెరిఫికేషన్ తెచ్చాక దీన్ని మొదట 60 నిమిషాల వరకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెండు గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏ భాషకు సంబంధించిన సినిమా విడుదల అయినా దానికి సంబంధించిన క్లిప్స్ ట్విట్టర్‌లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఫీచర్ పుణ్యమా అని ఇప్పుడు మొత్తం సినిమాను ట్విట్టర్‌లో పెట్టే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఒక నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి ఇటీవలే రిలీజ్ అయిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా పైరసీ ప్రింట్‌ను ఇప్పటికే అప్‌లోడ్ చేశారు. కొంతమంది బాస్కెట్ బాల్, ఇతర క్రీడలకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ట్విట్టర్ వెంటనే స్పందించి ఆ వీడియోను డిలీట్ చేయించినప్పటికీ అందులో కంటెంట్ అప్పటికే డౌన్‌లోడ్ల ద్వారా వైరల్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ట్విట్టర్ ఇకపై పోర్న్‌కు అడ్డాగా మారే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.


దీనిపై పాజిటివ్‌గా స్పందిస్తున్న వాళ్లూ లేకపోలేదు. మానిటైజేషన్ అందుబాటులోకి తెచ్చి క్రియేటర్స్‌కు సాయపడాలని కొందరు అంటుంటే, మరింత నాలెడ్జ్ పెంచుకునేందుకు ట్విట్టర్ ఉపయోగపడనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.