SC on Adani-Hindenburg Probe:  


అదానీ గ్రూప్‌పై సెబీ విచారణలో కీలక మలుపు! అదానీ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. ధరల హెచ్చుతగ్గుల్లో సెబీ విధానపరంగా విఫలమైందని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది.


అదానీ - హిండెన్‌ బర్గ్‌ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌లో కొన్ని లోపాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ ఓ నివేదికను విడుదల చేసింది. అలాగే ఆయా కంపెనీల్లో భారీ స్థాయిలో షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడింది. దాంతో నెల రోజుల పాటు షేర్ల ధరలు క్రాష్‌ అయ్యాయి. దాంతో కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ సహా విపక్ష నేతలు విమర్శల వర్షం గుప్పించారు. అదానీ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని, దాంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోయారని ఆరోపించారు.


ఈ వ్యవహారం చివరికి సుప్రీం కోర్టుకు చేరుకుంది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌లో రిలేటెట్‌ పార్టీ లావాదేవీలపై సెబీ దర్యాప్తు మొదలు పెట్టింది. దాంతో సుప్రీం కోర్టు ఆరుగురు వ్యక్తులతో నిపుణుల కమిటీని నియమించింది. కాగా అదానీ కంపెనీల్లో 13 ప్రత్యేకమైన లావాదేవీలపై సెబీ విచారణ కొనసాగిస్తోందని కమిటీ వెల్లడించింది. వాటిలో మోసపూరితమైనవి ఉన్నాయో లేదో తెలుసుకుంటోందని వివరించింది. ఆ లావాదేవీల వివరాలను సెబీ చురుగ్గా సేకరిస్తోందని, నిర్దేశిత సమయంలోనే దర్యాప్తు పూర్తి చేస్తుందని నొక్కి చెప్పింది.


విధాపరమైన వైఫల్యం గురించి మాట్లాడుతూ... ప్రస్తుత నిబంధనల ప్రకారం రెగ్యులేటరీ ఫెయిల్యూర్‌ కనిపించలేదని కమిటీ తెలిపింది. హిండెన్‌ బర్గ్‌ నివేదిక పబ్లిష్ అవ్వక ముందే కొందరు అదానీ కంపెనీల్లో షార్ట్‌ పొజిషన్లు తీసుకున్నారని సెబీ కొనుగొంది. నివేదిక రాగానే.. షేర్ల ధరలు క్రాష్‌ అవ్వగానే ఆ పొజిషన్లను స్క్వేర్‌ ఆఫ్ చేసి భారీ లాభపడ్డాయని తెలుసుకొంది. కాగా అదానీ కంపెనీల షేర్ల ధరలు స్థిరంగా ఉన్నాయని, సమీక్ష జరిగిందని కమిటీ తెలిపింది. 'జనవరి 24 ముందునాటి స్థాయిలకు ధరలు చేరకున్నా ప్రస్తుతం షేర్ల ధరలు నిలకడగా ఉన్నాయి. సరికొత్త స్థాయిల్లో ట్రేడవుతున్నాయి' అని పేర్కొంది.


ప్రస్తుత సమాచారాన్ని పరిశీలిస్తే 2023, జనవరి 24 తర్వాతే అదానీ షేర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల ఎక్స్‌పోజర్‌ పెరిగిందని కమిటీ గుర్తించింది. దీని వల్లే భారత ఈక్విటీ మార్కెట్లు ఎక్కువ హెచ్చుతగ్గులకు గురవ్వలేదని తెలిపింది. 'నిజానికి అదానీ స్టాక్స్‌లో వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక, ఆ తర్వాతి పరిణామాల వల్లే ఇలా జరిగింది' అని పేర్కొంది.


అదానీ కంపెనీల షేర్ల ధరల అవకతవకల ఆరోపణలపై విచారణ కొనసాగించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి సుప్రీం కోర్టు బుధవారం అనుమతించింది. అప్‌డేటెడ్‌ స్టేటస్‌ రిపోర్టును ఇవ్వాలని ఆదేశించింది. సెబీ ఆరు నెలలు గడువు అడగిన సంగతి తెలిసిందే.


Also Read: కేవలం 3% లాభంతో లిస్ట్‌ అయిన నెక్స్‌స్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌, ఇది ఊహించినదే!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.