Nexus Select Trust IPO Listing: భారతదేశంలో మొట్టమొదటి రిటైల్ REIT షేర్లు ఇవాళ (శుక్రవారం, 19 మే 2023) స్టాక్ మార్కెట్ జర్నీ ప్రారంభించాయి. ఈ షేర్లు కేవలం 3% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.
IPOలో షేర్ల ఇష్యూ ధర ₹100తో పోలిస్తే, BSEలో అవి ₹102.27 దగ్గర లిస్ట్ అయ్యాయి. ఇది 2.3% ప్రీమియం. ఈ వార్త రాసే సమయానికి, Nexus షేర్లు BSEలో 1.7% పెరిగి ₹104 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ స్టాక్ 'IF' గ్రూప్ కింద లిస్ట్ అయింది, 'T+1' సెటిల్‌మెంట్ పద్ధతిలో ట్రేడ్ అవుతోంది.
NSEలో, నెక్సస్ REIT షేర్లు 3% ప్రీమియంతో ₹103 వద్ద ప్రారంభమయ్యాయి. మార్కెట్ దీనిని ముందుగానే ఊహించింది. ఈ రిపోర్ట్ రాసే సమయానికి ₹103.63 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. NSEలో, ఈ షేర్ల ట్రేడింగ్ సాధారణ మార్కెట్ విభాగంలోనే జరుగుతుంది.
Nexus Select Trust REIT IPO ఈ నెల 9న ప్రారంభమై 11 వరకు ఓపెన్‌లో ఉంది. IPO సమయంలో ఒక్కో ఈక్విటీ షేరును ₹95 నుంచి ₹100 ధరతో ఇష్యూ చేశారు. IPO పరిమాణం ₹3,200 కోట్లు.
IPO చివరి రోజున, REIT IPO పూర్తిగా 5.45 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది, ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. సంస్థాగత పెట్టుబడిదార్ల కోసం రిజర్వ్ చేసిన కేటగిరీ 4.81 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇతర కేటగిరీలు 6.23 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
బ్లాక్‌స్టోన్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలోని కంపెనీ అయిన వైన్‌ఫోర్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్‌కు స్పాన్సర్.
కంపెనీ వ్యాపారం
17 హై క్వాలిటీ అసెట్స్‌తో కూడిన భారతదేశపు అతి పెద్ద మాల్ ప్లాట్‌ఫామ్ Nexus సెలెక్ట్ ట్రస్ట్. దిల్లీ (సెలెక్ట్ సిటీవాక్), నవీ ముంబై (నెక్సస్ సీవుడ్స్), బెంగళూరు (నెక్సస్ కోరమంగళ), చండీగఢ్ (నెక్సస్ ఎలాంటే), అహ్మదాబాద్ (నెక్సస్ అహ్మదాబాద్ వన్) సహా 14 ప్రముఖ జనసమ్మర్ధ నగరాల్లో ఇది విస్తరించి ఉంది. వాటి మొత్తం విస్తీర్ణం 9.8 మిలియన్ చదరపు అడుగులు కాగా, విలువ రూ. 23,000 కోట్లు.
నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పోర్ట్‌ఫోలియోలోని 17 ఆస్తుల్లో 96% ప్రాంతాన్ని లీజుకు ఇచ్చారు. జర, హెచ్&ఎం, యునిక్లో, సెఫోరా, సూపర్‌డ్రీ, లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి ఫేమస్ స్టోర్లు సహా దాదాపు 3,000 స్టోర్లు ఈ మాల్స్‌లో ఉన్నాయి. ఆపిల్ వంటి 1,100 పైగా జాతీయ & అంతర్జాతీయ బ్రాండ్‌లు ఇక్కడ అమ్ముడవుతున్నాయి.
బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేస్తున్న మూడో REIT ఇది. భారతదేశంలో మొట్టమొదటి REIT ఎంబసీ ఆఫీస్ పార్క్స్‌ను బ్లాక్‌స్టోన్ మొదట ప్రారంభించింది. ఆ తర్వాత మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REITని ప్రారంభించింది. ఇవి రెండూ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉన్నాయి. ఇవాళ మూడో REIT కూడా లిస్ట్ అయింది.
ఇది కూడా చదవండి: యూఎస్ ఫెడ్ హాకిష్ కామెంట్స్ - ఎర్రబారిన నిఫ్టీ, సెన్సెక్స్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.