RBI MPC Meet June 2024 Decisions: దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతాయని ఎదురు చూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా బ్యాంక్ లోన్లు తీసుకున్న వాళ్లకు, తీసుకోబోతున్న వాళ్లకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.50 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది. 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాన్స్ కంటిన్యూ చేస్తోంది. అంటే 16 నెలలుగా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసిన తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), MPC తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. RBI MPC తదుపరి మీటింగ్ ఈ ఏడాది ఆగస్టు 6-8 తేదీల్లో ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్ కొనసాగుతుంది. ఆ తర్వాత, అక్టోబర్ 7-9 తేదీల్లో; డిసెంబర్ 4-6 తేదీల్లో, 2025 ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఎంపీసీ భేటీ ఉంటుంది.
రెపో రేట్‌ను మార్చకపోతే, దేశంలో అధిక వడ్డీ రేట్లు మరికొంత కాలం కొనసాగుతాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో, ఇక నుంచి ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నగదును అందుబాటులో ఉంచడానికి అధిక వడ్డీ రేట్లు సాయం చేస్తాయి.